header

Nolina Plants.....నోలీనా మొక్కలు...

Nolina Plants.....నోలీనా మొక్కలు...
tambargia ముచ్చటైన ఆకృతితో ఎక్కడైనా పెంచుకునే అవకాశం ఉన్న మొక్కలు నోలినా.నోలినాను ముద్దుగా పోనీటైల్ పామ్, బాటిల్ పామ్,ఏనుగుపాదం మొక్క అని కూడా పిలుస్తారు. కాండం పైన సన్నగా కింద బంతి లాగా, బలంగా వెడల్పుగా ఉంటుంది. ఆహారాన్ని ఇవి కాండంలో దాచుకుంటాయి. మెక్సికో దేశానికి చెందిన ఈ మొక్కలు ఇప్పుడు అన్ని దేశాలలో లభిస్తున్నాయి. .
తక్కువ నీటితో ఆరోగ్యంగా పెరుగుతాయి నోలీనా మొక్కలు. వయసు బాగాపెరిగినప్పటి నుండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వీటి ఆకులు కొమ్మ చివర వలయాకారంలో అమరి ఉంటాయి. ఆకులు చూడడానికి సన్నగా బిరుసుగా, పదునైన అంచులతో చివర్ల మొనదేలి చూడడానికి పోనీటెయిల్ లాగా కనిపిస్తాయి. మొక్క ఎక్కువ ఉష్ణోగ్రతలో, అతి తక్కువ నీటితో పెరుగుంది. రోజూ నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. వారానికోసారి నీరు పోస్తే చాలు. ఆకుల అంచులు ఎండిపోతుంటే గాలిలో తేమ శాతం తక్కువగా ఉందని తెలుసుకుని కొద్ది రోజులపాటు ఆకుల మీద నీళ్ళు చల్లాలి. ముఖ్యంగా మన దగ్గర వేసవిలో ఆరోగ్యంగా ఎదిగే మొక్కలు ఇవి. ఈ మొక్కలను బయట పెంచుకోవాలంటే నేరుగా ఎండతగిలే ప్రపదేశంలో నాటుకోవాలి. ఇంటిలోపల అయితే ఎక్కువ కాంతి తగిలే ప్రదేశంలో ఉంచాలి. రాక్ గార్డెన్ లో ఈ మొక్కలను పెంచితే ప్రత్యేకంగా కనబడతాయి. అన్ని నేలలోను నోలినా మొక్కలు పెరుగుతాయి. నీళ్ళు నిలవని మట్టిని ఎంచుకోవాలి. నాటుకునేటప్పుడు మట్టిలో కంపోస్ట్ లేదా వర్మీకం కలిపితే మంచిది. రెండు మూడు నెలలకొకసారి 17:17:17 చొప్పున ఎన్ పీ కె నీళ్ళలో కలిపి మొక్కకు అందిస్తే ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా పెరుగుతాయి. .
కుండీలలో పెంచేవారు మొక్క రెండు మూడేళ్ళు ఎదిగిన తరువాత వెడల్పు మూతి గల కుండీలలోకి మార్చుకోవాలి. మొక్కల వేళ్ళు పైపైనే ఉంటాయి కాబట్టి లోతైన కుండీలు అవసరం లేదు.కుండీల నుండి వేరేకుండీల లోనికి మార్చేటపుడు మాత్రం వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రూనింగ్ చేసేటపుడు ఆకుల చివర్లను కత్తిరించకూడదు. మిలీబగ్ వంటివి దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని వేపనూనె నీటిలో కలిపి చల్లుకోవటం ద్వారా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు పూలు పూయటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నోలీనా మొక్కలను విత్తనాల ద్వారా కాకుండా నర్సరీల నుండి కోనుగోలు చేసి పెంచుకుంటే మంచిది
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...