Anti Mosquito Plants......దోమలను దూరంగా ఉంచే మొక్కలు
బంతిమొక్కలు :
బంతిమొక్కల ఆకులూ, పూలలో ఉండే పైరిత్రమ్ అనే పదార్ధం ఘూటైన వాసనతో దోమల్ని, కీటకాలను తరిమి
కొడుతుందట. వీటిని కుండీలలో పెంచి కిటికీల దగ్గరా, గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు. కానీ వీటికి ఎండ తప్పనిసరిగా తగలాలి.. అంతే కాదు టొమాటో మొక్కలమీద పెరిగే కీటకాలను నిరోధిస్తుంది కనుక టొమాటో తోటలలో కూడా పెంచుకోవచ్చు.
అగిరేటమ్ :
తెలుపు లేదా ఊదారంగు పూలు పూసే ఈ మొక్కను తెలుగులో కంపురొడ్డ, పోకబంతి అంటారు. గడ్డి మొక్కలు లాగా పెరిగే ఈ మొక్కల్లోని కౌమారిన్ ను వాణిజ్యపరంగా తయారుచేసే మస్కిటో రిఫెల్లెంట్లలో ఎక్కువగా వాడతారు. ఈ మొక్కలను కుండీలలో పెంచుకుంటే దోమల తాకిడి తగ్గవచ్చు.
లెమన్ బామ్ :
హార్స్ మింట్ లేదా బీబామ్ అని పిలుస్తాతరు. వీటి ఘూటైన వాసన దోమల్ని ఆమడ దూరం తరిమేస్తుందని అంటారు. ఈ మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి. నీటి ఎద్దడి తట్టుకుంటాయి. విత్తనాలు నేల మీదపడి
వాటంతట అవే మొలకెత్తుతాయి. మీ తోటలో దోమల బెడదలేకుండా కాసేపు హాయిగా కూర్చోవాలంటే మీ కుర్చీ దగ్గర రెండు, మూడు మొక్కలు నాటండి. వీటి ఆకులతో మంచి ఔషధ కషాయాన్ని చేసుకుని త్రాగవచ్చు. వీటి పూలు తేనెటీగలను,
సీతాకోక చిలుకల్ని ఆహ్వానిస్తాయి.
కాట్నిప్ :
ఔషధ మొక్కగా ప్రాచుర్యం పొందిన మొక్క దోమల్ని చక్కగా తరిమేయగలదట. ఆకుల్లో సహజంగా ఉండే నెపెటాలాక్టోన్ నూనె, మస్కిటో రిపెల్లెంట్ల కన్నా పదిరెట్లు ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.
గడ్డిమొక్కలా పెరిగే ఈ మొక్క మీతోటలో ఉంటే హాయిగా పనిచేసుకో వచ్చు.
రోజ్ మేరి :
ఈ మొక్కగాని ఇంట్లో ఉంటే దోమలను తరిమి కొట్టటమే కాకుండా వంటలు రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే మంచి వాసనతో ఉండే మొక్క రెమ్మలను సూపులలో, కూరలలో వాడుతూ ఉంటారు. ఈ మొక్కలకు
నీళ్ళ అవసరం కూడా పెద్దగా ఉండదు. ఈ మొక్కలను తోటలో చక్కగా పెంచుకోవచ్చు.
పుదీనా :
పుదీనాలో చాలా రకాలున్నాయి. ఏ రకమైన వీటి ఆకులలో ఉండే నూనెలంటేనే దోమలకు మంట. అందుకే వీటిని ఎక్కువగా కుండీలలో పెంచుకుంటే దోమల బాధనుండి ఉపశమనం లభిస్తుంది.
సిట్రొనెల్లా :
దీనినే తెలుగులో కామంచి కసు అంటారు. మస్కిటో రిపెల్లంట్ అని కూడా పిలిచే ఈ మొక్కకు దోమలు కాస్తా దూరంగానే ఉంటాయి. అయితే చాలా మంది ఈ మొక్కలనుండి వచ్చే సువాసనకోసం పెంచుతారు.
గుమ్మంకిరు వైపులా ఈ మొక్కలను పెంచుకోవటం వలన సువాసనగా ఉంటుంది. అయితే ఈ ఆకులు త్రుంచి రుద్దినపుడే ఎక్కువగా వాసన వస్తుంది. ఇందులోని సిట్రొనెల్లా పదార్థాన్ని రిపెల్లంట్ కొవ్వొత్తులలో మరియు సబ్బులలో వాడతారు.
ఇంకా వెల్లుల్లి, లవంగమొక్క, వెనీలా, టీ, లావెండర్, యూకలిప్టస్, సేజ్ బ్రష్, ఫైనాపిల్ మొక్కలకు దోమలను అడ్డుకునే గుణం ఉంది. ఈ ఆకులను నలిపి ఒంటికి రుద్దుకున్నా దోమలు కుట్టకుండా ఉంటాయి.