header

Powderpulf Kandretam

పౌడర్ పఫ్ కాండ్రేటమ్ ....అగ్నిపొద పూలు

ప్రకాశవంతమైన, ఎర్రని పూల గుత్తులతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకునే ఆకర్షణీయమైన మొక్క ఇది. దీని శాస్త్రీయనామం కాంబ్రాటమ్ కాన్ స్ట్రిక్టమ్. దీనిని ధాయ్ లాండ్ పౌడర్ పఫ్, అగ్నిపొద అని కూడా అంటారు.
ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ మొక్క మన దగ్గర కూడా చక్కగా పెరుగుతుంది. దీనిని తీగలాగా సాగే పొద లేదా పొదలాగా పెంచగలిగిన తీగ అని చెప్పవచ్చు. పూర్తి ఎండలో చక్కగా పెరుగుతుంది. ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. దీనిని పెంచడం సులభం. నాటిన తరువాత కుదురుకునే వరకూ క్రమం తప్పకుండా నీళ్ళు పోస్తే చాలు. తరువాత పెద్దగా జాగ్రత్త తీసుకోనవసరం లేదు.
పౌడర్ ఫఫ్ చాలా అందమైన మొక్క ఎర్రని ఎరుపు రంగుపూలు శంఖాకారపు గుత్తుల్లో కొమ్మల చివరన పూస్తాయి. చిన్న చిన్న మొగ్గలు ఒత్తుగా ఉన్న గుత్తులో అమరి ఉండి ఒకటొకటిగా విచ్చుకుంటాయి. ఎర్రని నక్షత్రాల్లా మెరిసే పూలలోంచి ఇంకా నిండు ఎరుపులో పొడవాటి కేసరాలు విరజిమ్మినట్లగా వచ్చి మనోహరంగా కనిపిస్తాయి. ఈ ముచ్చటైన మొక్క దాదాపు సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటుంది.
దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్కను కత్తిరించుకుని చిన్న చెట్టులాగా పెంచుకోవచ్చు. ఇది ఎలా కత్తిరించినా తట్టుకుంటుంది. కుండీలో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. పౌడర్ పఫ్ మొండి మొక్క. దాదాపు చీడపీడలేవీ ఆశించవు. అప్పుడప్పుడూ వేపకషాయం చల్లితే సరిపోతుంది. నెలకోసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును సూక్ష్మపోషకాల మిశ్రమ ఎరువునూ నీటిలో కలిపిసోస్తూ ఉంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. పూర్తి ఎండలో పెరిగే ఈ మొక్క ఎలాంటి తొటకైనా అదనపు ఆకర్షణ.
సీతాకోక చిలుకలకూ, పక్షులకూ దీని పూలంటే చాలా మక్కువ. పౌడర్ పఫ్ కు ఔషధ గుణాలు కూడా ఎక్కువ. దీని వేర్లలో చిన్న పిల్లలలో నులిపరుగుల నివారణకు వాడతారు. దీనిని శీర్ష కత్తిరింపుల ద్వారా కానీ , గాలి అంట్లు ద్వారా గానీ సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. అలాగే విత్తనాలు కూడా బాగానే మొలకెత్తుతాయి.
----బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్ సౌజన్యంతో..........