బ్రహ్మకమలంగా పొరబడి, విశేష ప్రచారం పొందిన కాక్టస్ జాతికి చెందిన మొక్క నిశాగంధి. క్వీన్ ఆఫ్ ది నైట్ అనీ, ఫ్రాగ్నెంట్ ఆర్కిడ్ కాక్టస్ అనీ, లేడీ ఆఫ్ది నైట్ అనీ దీన్ని పిలుస్తారు. నిశాగంధి శాస్త్రీయ నామం ఎఫిఫైలమ్ ఆక్సి పెటాలమ్.
ఆకుల చివరన పూసే ఆకర్షణీయమైన కమలాల్లాంటి ధవళవర్ణ పూలు ఎనిమిది నుంచి పది అడుగుల వ్యాసంతో ఉంటాయి. ఇవి రాత్రి పొద్దుపోయాక విచ్చుకుని పరిసరాలనంతా సువాసనతో నింపుతాయి. మళ్లీ పొద్దు పొడవక ముందే వాడిపోతాయి. ఒక ఆరోగ్యకరమైన మొక్క ఒకసారి దాదాపు పది నుంచి పదిహేను పూలు పూయగలదు. ఇలా సంవత్సరంలో నాలుగైదు సార్లు పూస్తుంది. అయితే ఇంత ప్రత్యేకంగా ఉండే ఈ మొక్కను పెంచడానికి అస్సలు శ్రమ పడాల్సిన అవసరం లేదు. వరండాలూ, బాల్కనీలు, తోటలూ...
ఇలా ఎక్కడైనా సరే సులువుగా పెరగగలుగుతుంది. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్కే అయినా ముళ్లుండవు. అలానే ఈ మొక్కకు ఆకుల్లా కనిపించేవి నిజమైన ఆకులు కావు. అవి... పొడవుగా, పల్చగా మారిన కొమ్మలు. వీటి ఆధారంతో పైకి కట్టినా, ఎత్తుమీద అమర్చినా, కుండీ నుంచి కిందకు వేలాడేలా చేసినా పూలు అందంగా కనిపిస్తాయి.
సులువుగా పెరుగుతుంది...
నిశాగంధి ప్రవర్థనం ఎంత సులువంటే ఈ ఆకుల్లాంటి కొమ్మల్ని చిన్న ముక్కలుగా చేసి నాటితే సులువుగా వేళ్లూనుకుంటాయి. పూర్తి ఎండలో, ప్రకాశవంతమైన వెలుతురులో ఇది చక్కగా పెరుగుతుంది. ఎర్రమట్టి, ఇసుకా, సన్నని గులకరాళ్లు, వర్మీకంపోస్టు, వేపపిండి సమపాళ్లలో మట్టి మిశ్రమం కలిపి దీన్ని నాటుకుంటే ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఎక్కువ పూలూ వస్తాయి. వారాల తరబడి నీళ్లు లేకున్నా బతకగలిగే ఈ మొక్క వారానికోసారి నీళ్లు, నెలకోసారి ఎన్పీకే ఉండే సమగ్ర ఎరువు(లీటరు నీటికి ఐదుగ్రాములు) ఇస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది.
రంగుల్లో అందంగా...
నిశాగంధిని కణుపుల దగ్గర తుంచుతూ ఉంటే గుబురుగా, ఎక్కువ కొమ్మలతో పెరిగి ఎక్కువ పూలు పూస్తుంది. దీనిలో ఇప్పుడు గులాబీ, పసుపూ, ఎరుపూ, నారింజ రంగులో పూసే హైబ్రిడ్ రకాలు వచ్చాయి. ఒకసారి మొగ్గ వచ్చాక ఈ మొక్క ఉన్న చోట నుంచి కదల్చకపోవడమే మంచిది. ఎందుకంటే వెలుతురూ, ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేడాలుంటే మొగ్గలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోయే ప్రమాదం ఉంది. కుండీ పూర్తిగా వేళ్లతో నిండినప్పుడు అంటే రెండు మూడు సంవత్సరాలకోసారి కుండీ మార్చాలి. కుండీ ఇరుకుగా ఉంటేనే ఇది బాగా పూస్తుంది. నిశాగంధికి చీడపీడల భయం దాదాపు లేదు. నీళ్లు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకుంటే చాలు.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...