header

Rassilia, Fountain Plant.....రస్సీలియా

Rassilia, Fountain Plant.....రస్సీలియా
రస్సీలియా :
ఫౌంటైన్ మొక్క, పగడాల మొక్క అని రకరకాల పేర్లతో పిలిచే రస్సీలియా పేరుకు తగ్గట్టు పగడాలను విరజిమ్ముతున్న ఫౌంటైన్ లాగా, ఎర్రటికాంతులు విరజిమ్మతున్న కాకరపువ్వొత్తులు లాగానో, ప్రకృతి కురిపిస్తున్న పూలవర్షంలాగానో అనిపిస్తుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. వాలిపోయే లక్షణం గల బహువార్షిక మొక్క ఇది.

పూల ప్రత్యేకత :
ఈ మొక్క ఎదిగే క్రమంలో కొమ్మలన్నీ ఒకే దగ్గరనుంచి మొదలవుతాయి. కాండం నలుపలకలుగా ఉంటుంది. ఆకులు చిన్నవిగా అండాకారంలో పొలుసుల్లా ఉంటాయి. దీనికొమ్మలు, ఆకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులోనూ, సన్ననిగొట్టాలాంటి పూలు చక్కని ఎరుపు, మెరిసే మీగడ వర్ణంతో పాటు లేత కాషాయం, గులాబీ వర్ణాలలో పూసే రకాలూ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రస్సీలియా సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. ఎటువంటి వాతావరణంలోనైనా నేలలోనైనా సులభంగాఎదిగే లక్షణం ఈమొక్క సొంతం. ఎండలోనే కాదు నీడలోనూ చక్కగా పెరుగుతుంది. ఒక్కసారి కుదురుకుంటే చీడపీడలబెడద కూడాపెద్దగా లేదు. ఎక్కువ పూలను అందించే రస్సీలియా మొక్కను సారవంతమైన నేలలో నాటుకుంటే మేలు. అదీలేదంటే నెలకోసారి 17:17:17 చొప్పున ఎన్ పీ కే ఉండే సమగ్ర ఎరువును అందించాలి. వేరుశెనగపిండి, కానుగపిండి, బోన్మీల్ వంటి సేంద్రీయ ఎరువులను నేలలో కలుపుతూ ఉంటే చక్కగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా నీళ్ళు పోస్తుంటే ఎప్పుడూ తాజాగా కనిపిస్తూ పూలవానలు కురిపిస్తుంది.

మకరందం ప్రత్యేకం :
కొత్తకొమ్మలు నిలువుగా పెరిగినా కొద్దిరోజులకే అందంగా పక్కకి వంగిపోతాయి. ఇలా వాలిపోయే లక్షణం వల్ల గోడపక్కన నాటుకున్నప్పుడు దానిమీద నుంచి కిందకి వాలి చూడముచ్చటగా కనిపిస్తుంది. అలానే నీళ్ళఒడ్డున పెంచితే మరింత అందంగానూ ఉంటుంది.తరచూ ముదిరిపోయిన కొమ్మలను కత్తిరించేస్తుంటే కొత్తకొమ్మలతో లేతగాచక్కగా ఉంటుంది.రస్సీలియాను రాక్ గార్డెన్ లోనూ,గుంపుగా కనిపించేలా,నీటికొలను పక్కనా,కుండీల్లో,వేలాడే తొట్లలోనో కాకుండా ఇతర మొక్కలతో కలిపినాటుకోవచ్చు. ఈ పూలు ఎక్కువ మకరందాన్ని కలిగి ఉండటం వలన తుమ్మెదలు, పక్షులు, సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి. దీనివేరు మొక్కలను విడదీసి సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు.

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...