Rose Cactus .........గులాబీ బాల ....ముళ్ళచెట్టు
రోజ్ కాక్టస్.....ఒళ్ళంతా ముళ్ళుండే కాక్టస్ జాతికి చెందినది. కాకపోతే ఇది కాక్టస్ లా ఉండదు. నున్నగా ఉండే కాండం మీద ముళ్ళుంటాయి. దీనికి. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క అని చేప్పే ఏకైక అంశం ఇదొక్కటే. అది తప్ప దీని ఆకులు, పూలు, కొమ్మలు, దేన్ని చూసినా మనకు అలా అనిపించవు. అంతేకాదు ఆకులతో నిండుగా ఉండే కాక్టస్ రకం కూడా ఇదొక్కటే. అరుదైన ఈ కాక్టస్ శాస్త్రీయనామం పెరెస్కియా బ్లియో. ఆకు కాక్టస్, మైనం గులాబీ అనే పేర్లు కూడా దీనికి ఉన్నాయి ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తువరకు పెరిగే ముళ్ళతో కూడిన చిన్న చెట్టు ఇది. కత్తిరించి పొదలా పెంచుకోవచ్చు. పూర్తి సూర్యకాంతిలోనే కాకుండా కొద్దిపాటి నీడలో కూడా చక్కగా పెరుగుతుంది. సారవంతమైన నీరు నిలవని మట్టి మిశ్రమం అవసరం. రెండు పాళ్ళ ఇసుక, ఒకపాలు ఎర్రమట్టి, ఒక పాలు వర్మీకం పోస్టు ఉండే మిశ్రమం అనువుగా ఉంటుంది. రోజ్ కాక్టస్ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కానీ ఎక్కువ రోజులు నీళ్ళు పోయకపోతే ఆకులు రాలిపోతాయి.
రోజ్ కాక్టస్ పళ్ళని తింటారు
దీని అందమైన పెద్ద నారింజ రంగుపూలు గులాబీలను పోలి ఉంటాయి. అందుకే దీనికి రోజ్ కాక్టస్ అన్నపేరు. దీని పళ్ళు కూడా బంగారు రంగులో అందంగా ఉంటాయి. చక్కటి పైనాపిల్ సువాసనతో పుల్లగా ఉండే ఈ పళ్ళను తింటారు. ఆకులను కూడా ఉడికించి కూరలా చేసుకుంటారు. వేగంగా పెరిగే కాక్టస్ ఇది. ఎక్కువకాలం బతుకుతుంది కూడా. చీడపీడలు దాదాపు ఆశించవు. క్రమం తప్పకుండా ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువు వేస్తూ ఉంటే చక్కగా పూస్తుంది. ఏడాదంతా పూసే మొక్క ఇది. కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. ఇతర కాక్టస్ లాగా కత్తిరించిన తర్వాత ఒకటి రెండు రోజులు ఆరనివ్వకుండా వెంటనే నాటాలి. విత్తనాల ద్వారా కూడా ప్రవర్ధం చేయవచ్చు. నాటిన విత్తనాలు మూడు నుండి నాలుగు వారాలలో మొలకెత్తుతాయి. రోజ్ కాక్టస్ కుండీలలో కూడా చక్కగా పెరుగుతాయి. రెండుమూడు అడుగుల ఎత్తులో కత్తిరించి పెంచుకుంటే గుబురుగా పెరిగి చక్కగా పూస్తుంది. అందమైన అరుదైన ఈ మొక్కకు ఔషధగుణాలు కూడా ఎక్కువే.
--బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్ సౌజన్యంతో........
br/>
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...