వర్షాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకాశవంతమైన రంగుల సొగసుని జోడించే మొక్కల్లో ఎర్రసాల్వియా ప్రధానమైనది. ఎర్ర సాల్వియా శాస్త్రీయనామం సాల్వియా స్పెండెన్స్. అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్కను అన్ని రుతువుల్లోనూ నాటుకోవచ్చు.
సీజనల్ మొక్కలో ఎక్కువకాలం పూసే మొక్క ఇది. కొన్ని ప్రాంతాల్లో బహువార్షికంగానూ పెరుగుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు, మురిపించేఎరుపు రంగులో కంకుల్లో పూసే పూలతో సాల్వియా కనువిందు చేస్తుంది. బాగా వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడలోనూ చక్కగా పెరుగుతుంది.
సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమం దీనికి అనువుగా ఉంటుంది. నేల పొడిబారినా, నీళ్లు నిలిచినా సాల్వియాకు నచ్చదు. వర్షాలు పడగానే సాల్వియాను నాటుకోవచ్చు. దీనిని ముందుగా నారు పోసుకుని కావలసిన చోట నాటుకుంటారు. బెడ్‌ను ఆరు అంగుళాల లోతువరకూ తవ్వుకొని పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, వేపపిండి, కొద్దిగా సూపర్‌ఫాస్ఫేటు, కలుపుకోవాలి. చదునుచేసుకొని మొక్కను నాటుకోవాలి. పది నుంచి పన్నెండు అడుగుల ఎడంతో నాటాలి. ఆపై రెండు అంగుళాల లోతువరకూ తడిచేలా నీరు పెట్టుకోవాలి.
వరుసల్లో అందంగా...
దీనికి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును అందించాలి. కొబ్బరిపొట్టు లేదా ఎండాకులతో మల్చింగ్ వేసుకుంటే తేమ ఆవిరైపోదు. కలుపూరాదు. బెడ్‌ల్లో నాటినప్పుడు నిటారుగా పెరిగే చిన్న చిన్న కంకుల్లో, ఎర్రని పూలతో నిండుగా ఎర్ర తివాచీలా కనిపిస్తుంది బోర్డరుగాను, కుండీల్లోకి, మిశ్రమాల్లో నాటడానికీ ఇది బాగుంటుంది.
ఎన్నో రంగుల్లో...
పూలు పూయడం అయిపోయాక కంకులను ఎప్పటికప్పుడు కత్తిరించేస్తుంటే ఎక్కువ పూలతో పాటు ఎక్కువ రోజులూ పూస్తుంది. అలాగే ఈ అయిపోయిన కంకులను తీసేయకపోతే, బోట్రైటిస్ తెగులతో పాటు, రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువే. సేంద్రియ కషాయాన్ని క్రమం తప్పకుండా చల్లుకోవాలి. ఆకులు పసుపుపచ్చగా మారి వాలిపోతుంటే కొంచెం నీళ్లు ఎక్కువ ఇవ్వాలి.
దీన్ని ఎర్ర సాల్వియా అని పిలిచినా తెలుపు, గులాబీ, లావెండర్, వూదా, నారింజ వంటి అనేక రంగుల్లో పూసే రకాలున్నాయి. నిండు రంగులు వేడి ప్రదేశాలకు అనువుగా ఉంటాయి. శీతల ప్రాంతాల్లో అన్ని రంగుల రకాలూ చక్కగా పెరుగుతాయి. గొట్టాలవంటి సాల్వియా పూలు మకరందానికి నెలవులు. అందుకే సీతాకోక చిలుకలూ, హమ్మింగ్ పిట్టలూ సాల్వియాల చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి. తాజాపూలనే కాదు, పూలకంకులను నీడలో ఎండబెట్టి కూడా అలంకరణలో వాడవచ్చు.
సాల్వియాలను విత్తనాలతో సులువుగా ప్రవర్థనం చేసుకోవచ్చు. సంచుల్లో పెంచిన మొక్కలతోపాటు పెద్ద నర్సరీలలో నారు కూడా దొరుకుతుంది.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....