అందమైన మొక్కలతో పాటు ప్రత్యేక రకమైన మొక్కల్ని పెంచడంలో దొరికే ఆనందమే వేరు. అలాంటి ఒక మొక్క కంఠహారం లేదా నెక్లెస్పాడ్.
నెక్లెస్పాడ్ను సిల్వర్బుష్, ఎల్లో సోఫోరా అనీ కూడా అంటారు. దీని శాస్త్రీయనామం సొఫోరా టొమెంటోసా. ఇది గుబురుగా కింది నుంచీ కొమ్మలతో, ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తువరకూ పెరిగే పొద. కరివేపాకు ఆకుల్లా ఉండే దీని ఆకులు వెండి కలిసిన ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. దీని ఆకులూ, కాడలూ అన్నీ వెల్వెట్ లాంటి వెండి రంగు నూగుతో కప్పి ఉండటంతో మొక్క మొత్తం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వెండి రంగు వల్లే దీనికి సిల్వర్బుష్ అన్నపేరు వచ్చింది. దీని పూలు ప్రకాశవంతమైన పసుపు రంగులో కొమ్మల చివర కంకుల్లో పూస్తాయి. ఈ పూల వర్ణాన్ని బట్టి దీనికి ఎల్లో సోఫోరా అన్న పేరు వచ్చింది. ఈ పూలు కంకిలో కింద నుంచి పైకి వికసిస్తూ వస్తాయి. ఇది దాదాపు సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది.
సీతాకోక చిలుకల నేస్తం...
నెక్లెస్పాడ్ జన్మస్థానం దక్షిణ అమెరికా. ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ మొక్క మన వాతావరణానికి చాలా అనువుగా ఉంటుంది. సారవంతమైన నేలలో ఇది చక్కగా పెరుగుతుంది. మొక్క ఒకసారి కుదురుకునే వరకూ క్రమం తప్పకుండా నీళ్లుపోస్తే చాలు, తరవాత పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేదు. పూర్తి ఎండలో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది. బోర్డరుగానూ, గుంపుగా నాటడానికి చాలా అనువుగా ఉండే ఈ మొక్కలోని ఇంకో ప్రత్యేకత దీని కాయలు. ఇవి గుండ్రని పెద్ద పెద్ద గింజలను ప్రస్ఫుటంగా చూపుతూ పూసలతో గుచ్చిన హారాల్లా అనిపిస్తాయి. అందువల్లే ఈ మొక్కకు నెక్లెస్పాడ్ అన్న పేరు వచ్చింది. అలాగే దీని పూలు ఎంత మకరందాన్ని అందిస్తాయంటే తేనెటీగలూ, సీతాకోక చిలుకలూ, హమ్మింగ్ పిట్టలూ... ఈ మొక్కను వదిలి పక్కకే పోవు.
ఎరువుల అవసరం తక్కువే...
పిండిపురుగులూ, బూడిద తెగులూ, ఈ మొక్కను ఎక్కువగా ఆశిస్తాయి. వేపనూనె, ఇంకా ఇతర ఆకు కషాయాలతో పిండి పురుగులనూ, వంటసోడా కలిపిన నీళ్లతో బూడిద తెగులును ప్రారంభదశలోనే అదుపులో ఉంచాలి. దీనికి ఎరువులు పెద్దగా అవసరం లేదు కానీ ఏడాది పొడవునా పూస్తుంది కనుక నెలకోసారి రసాయన సమగ్ర ఎరువును ఇవ్వడం లేదా సేంద్రియ ఎరువులను మట్టి మిశ్రమంలో కలపడం కానీ చెయ్యాలి.
నెక్లెస్పాడ్ సముద్రతీరాల్లో కూడా చక్కగా పెరుగుతుంది. ఇది పార్కింగ్ స్థలాల్లోనూ, తోటలో వెనుక వరసలో నాటడానికి కూడా అనువైన మొక్క. విత్తనాల ద్వారా, కొమ్మకత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ఆఫ్రికాలో ఇళ్లల్లోకి పురుగులూ, సాలీళ్లు రాకుండా ఉండేందుకు ఈ మొక్క ఇంటిముందు నాటుకుంటారట. ఇంత ప్రత్యేకమైన మొక్కను పెంచుకోవాలన్న ఉత్సుకత అందరికీ సహజంగానీ మీ ఇంట్లో పసిపిల్లలో, పెంపుడు జంతువులో ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఆకర్షణీయంగా కనిపించే దీని విత్తనాలు బాగా విషపూరితాలు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....