header

Strobilantas, Parsian Shield.......స్ట్రోబిలాంతస్

Strobilantas, Parsian Shield.......స్ట్రోబిలాంతస్
vadamalli ఈ మొక్కనే పర్షియన్ షీల్డ్ అనికూడా అంటారు. ఇది అందమైన ఆకులు ఇష్టపడే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండవలసిన మొక్క. మొత్తని కొమ్మలతో గుబురుగా పెరిగే చిన్నపొద ఇది.
అడుగు నుండి రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. కాండం పలకలుగా ఉంటుంది.ఆకుల చివర్లు సాగి మొనదేలి ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, ఊదా, వెండి రంగుల మిశ్రమంతో లోహపు మెరుపుతో అద్భతంగా కనిపిస్తాయి. ఈ మెరుపు వలనే దీనికి పర్షియన్ షీల్డ్ అన్నపేరు వచ్చింది. పేరులో పర్షియా ఉన్నా దీని జన్మస్ధలం మయన్మార్. ఆకుల అడుగు భాగం ఊదా రంగులో ఉంటుంది. దీనికి శీతాకాలంలో గొట్టాల్లాంటి అందమైన లేత నీలిరంగు పూలుచిన్న చిన్న కంకుల్లో పూస్తాయి. ఈ పూలు చూడ్డానికి బాగుంటాయి. కానీ పూలు పూస్తున్నపుడు ఆకుల పరిమాణం తగ్గుతుంది. అవి వద్దనుకుంటే మొగ్గలోనే తుంచేస్తే ఆకులు చక్కగా పెరుగుతాయి.

చీడపీడలు తక్కువే :
స్ట్రోబిలాంధస్ ను ఇంటిలోపలా, బయటా చక్కగా పెంచుకోవచ్చు. ఇది నీడలో పెరిగే మొక్క. చెట్లకిందా, బాల్కనీలలో, వరండాలలో నచ్చిన చోట ఎక్కడైనా పెంచుకోవచ్చు.
దీనిని విడిగా కంటే కుండీలలోనూ, ఇతర మొక్కలతోనూ కలిపి నాటుకుంటే భలే అందంగాను ఉంటుది. చెట్ల నీ కిందా నాటుకోవచ్చు. ముఖ్యంగా ఫెర్న్ లు, ఇంపేషన్స్, బిగోనియా, అస్సరాగస్, పసుపు రంగుల పోమియాలతో మిశ్రమ అమరికలలో అద్భతంగా ఉంటుంది. స్ట్రోబిలాంధస్ సులువుగాపెరిగే మొక్క. మనవేడి వాతావరణానికి అనువైంది. దీనికి రోజూ నీరు అవసరంలేదు. చీడపీడల భయమూ తక్కువే. కంపోస్టు ఎక్కువగా ఉండేనీరు నిలవని మట్టి మిశ్రమంలో బాగాపెరుగుతుంది. నీరు నిలవకుండా చూసుకోవాలి. లేకపోతే వేరుకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంది. అప్పుడపుడు వేపకషాయం, కానుగ కషాయం వంటివి చల్లుతూ ఉంటే రసం పీల్చే పురుగులు ఆశించవు. స్ట్రోబిలాంధస్ కు గాలిలోతేమ ఎక్కువగా కావాలి.

కుండీలలో పెంచేటపుడు అడుగున ప్లేటులో ఇసుక గానీ గులకరాళ్ళు గానీ పోసి తడుపుతూఉంటే కావల్సిన తేమ అందుతుంది. బయట పెంచేటపుడు ఎండు ఆకులను, కొబ్బరి పీచును మల్చింగ్ లాగా చేసుకోవాలి. చిగుళ్ళు తుంచితే చక్కగా గుబురుగాపెరుగుతుంది. కత్తిరింపులతోనూ సులువుగా ప్రవర్ధనంచేసి మనకు నచ్చినట్లుగా పెంచుకోవచ్చు.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...