header

Wadamalli Flower Plants....వాడామల్లి

Wadamalli Flower Plants....వాడామల్లి
vadamalliగులాబీలను పోలి ఉండి ఇంటికి కళను తీసుకు వస్తాయి ఈ పూలు. వీటిని గోమ్ ఫెర్నా అంటారు. శివుడికి, కుమారస్వామి బాగా ఇష్టమైన పూలు. ఒకసారి నాటితే ఏడాది వరకూ పూలుపూసే మొక్కలు ఇవి. నేలలోనూ, కుండీలలోనూ పెంచు కోవచ్చు. విండో ప్లాంటర్ల లో పెంచుకోవచ్చు. వెడల్పు మూతి కలిగిన వాటిని ఎంచుకుంటే మంచిది. పూలువాడిన తరువాత అవి తొట్టిలోనే పడి వాటినుంచి విత్తనాలు నేలపై పడి కొత్త మొక్కలు కొన్నివారాలలోనే పెరుగుతాయి.
ఒక మొక్క చనిపోయేలోగా దాని చుట్టూ పది మొక్కలు దాని చుట్టూ గుబురుగా పెరుగుతాయి. పూల వ్యాపారులు బంతిపూల తరువాత ఈ పూలనే ఎక్కువగా అమ్ముతారు.
భూమిలో సారాన్ని బట్టి ఇవి రెండడుగల ఎత్తులో పెరుగుతాయి. ఈ మొక్క ఎదిగి పూయడానికి మన రాష్ట్రంలోని అన్ని నేలలూ అనువైనవే. కానీ వీటిని నీడలోనే పెంచాలి. ఎక్కువ ఎండ పనికిరాదు. ఎండలు విపరీతంగా ఉండే వేసవిలో కూడా ఎండకు తట్టుకుని చక్కగాపెరుగుతాయి. తుమ్మెదలను, సీతాకోక చిలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
కుండీలలో పెంచేటపుడు మట్టితో పాటు సమపాళ్ళలో సేంద్రియ ఎరువును కలిపి...దానిలో కొంచెం బోన్ మీల్, వేపపిండి వేయాలి.ఇలాంటి మట్టిలో విత్తనాలు నాటుకుంటే మరలా ఎటువంటి పోషకాలు, కీటక మందులు వాడే అవసరం ఉండదు. మొక్క ఆరోగ్యంగా అందంగా ఎదుగుతుంది. నీటి కొరత ఉన్న ప్రదేశాలలో కూడా అందుబాటులో ఉన్న నీటినే గ్రహిస్తూ పూలు పూస్తుంది. వర్షాకాలంలో చలికాలంలో రెండు రోజుల కొకసారి ఎండాకాలంలో ప్రతి రోజూ నీరు పోయాలి.
మార్చి నుండి జూన్ వరకు ఈ పూలు ఎక్కువగా పూస్తాయి .మన ప్రాంతంలో ఎక్కువగా గులాబీ రంగు పూలు పూసే మొక్కలు ఎక్కువగా లభిస్తాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాల ద్వారా తెలుపు, ఎరుపూ, లేత గులాబీ మొక్కలు లభిస్తున్నాయి. దీనికి చీడపీడల సమస్య చాలా తక్కువ. తెల్లదోమ, పేను బంక వంటివి సోకినపుడు వేపనూనెను నీటిలో కలిపి రెండు రోజులకు ఒక సారి చొప్పున చల్లాలి. ఇలా పదిసార్లు చేయాలి.ఈ మొక్కలు నర్సరీలలో దొరకవు. ఈ మొక్కలు పెంచుకునే వారి దగ్గర నుండి విత్తనాలను సేకరించి నాటుకుంటే ఆరు నుండి ఎనిమిది వారాలలో మొలకెత్తుతాయి.
మాధవీరావు....సౌజన్యంతో...