header

Water Cabbage.. వాటర్‌ క్యాబేజీ

Water Cabbage…నీళ్లల్లో..... వాటర్‌ క్యాబేజీ

celosia నీళ్ల మీద తేలుతూ ఉండే ఆకుపచ్చని పువ్వుల్లాంటి మొక్కలను చాలామంది తొట్లలో పెంచుకుంటూ ఉంటారు. అదే వాటర్‌ క్యాబేజీ. దీన్ని వాటర్‌ లెట్యూస్‌, నైల్‌ క్యాబేజీ, షెల్‌ ఫ్లవర్‌ అనీ అంటారు. దీని శాస్త్రీయనామం పిస్టియా స్ట్రాటియోటిస్‌.
వాటర్‌ క్యాబేజీ నీళ్లలో పెరిగే మొక్క. దీన్ని మొదటగా ఆఫ్రికాలోని నైలునదిలో కనుగొన్నారు. ఇది బహువార్షికం. కొంచెం మందంగా, మెత్తగా పువ్వు ఆకారంలో లేతాకుపచ్చ ఆకులతో ఉంటుంది. దీనికి కాండం ఉండదు. ఆకుల అడుగు నుంచి గుత్తిలాగా పొడవుగా వేలాడే ఈకల్లాంటి వేళ్లతో నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది. ఈ వేళ్లు దాదాపు అరమీటరు పొడవు వరకూ పెరగగలవు. వీటి ఆకులు సన్నటి నూగుతో కప్పేసి ఉంటాయి. దీని పూలు చిన్నగా, ఆకుల మధ్య కప్పేసి ఉండి సరిగా కనపడవు. ఇది నెమ్మదిగా ప్రవహించే లేదా నిలిచి ఉండే నీరూ, కొలనూ, చెరువులూ, జలాశయం వంటివాటిలో ఎక్కువగా పెరుగుతుంది. మనం పెంచుకోవాలనుకుంటే నీళ్లు నింపిన తొట్టిలో గానీ, గాజు గిన్నెలోగానీ పెంచుకోవచ్చు. అలాగే అక్వేరియంలకు కూడా అనువైన మొక్క ఇది.
తగినంత వెలుతురు అవసరం... వాటర్‌ క్యాబేజీ పూర్తి ఎండలోనే కాకుండా కొద్దిపాటి నీడలో కూడా పెరుగుతుంది. ముందు నెమ్మదిగా పెరిగినా తరవాత వేగంగా పెరిగి పిలకలతో తొట్టి అంతా నిండుతుంది. కొత్తగా తెచ్చిన వాటర్‌ క్యాబేజీని నీళ్లలో వేసినప్పుడు వారం పదిరోజులు కొద్దిపాటి నీడలో ఉంచి తరవాత ఎండలోకి మార్చితే మంచిది. ఎండ సరిగా తగలకపోయినా, గాలిలో తేమ తక్కువగా ఉన్నా వాటర్‌ క్యాబేజీ సరిగా పెరగదు. అలాంటప్పుడు తగినంత వెలుతురు పడేలా చూసుకోవడంతోబాటు పెరుగుదల సరిగా వచ్చేవరకూ కుండీని రోజూ కాసేపు పాలిథీన్‌ కవర్‌తో కప్పి ఉంచాలి. పసుపు రంగుకు మారిన, ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి.
నీటిని శుద్ధి చేస్తుంది.. వాటర్‌ క్యాబేజీలో తల్లి మొక్క పక్క నుంచి పిలకలు తయారవుతాయి. ఇవి స్టోలన్లు అనే కాడల ద్వారా తల్లిమొక్కకు అంటుకుని ఉంటాయి. ఈ పిలకలను విడదీసి కొత్త మొక్కలుగా పెంచుకోవచ్చు. వాటర్‌ క్యాబేజీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మొక్కలు తొట్టిలో నిండిపోయినప్పుడు కొన్నింటిని తీసి ఎండబెట్టి పొడిచేసి ఎరువుగా వాడుకోవచ్చు. అలాగే ఈ మొక్క నీటిలో నుంచి అదనంగా ఉన్న నత్రజనిని, భాస్వరాన్నీ, భార ఖనిజాలను తొలగించి శుద్ధి చేయగలదు. దుస్తుల మీద మరకల్ని తొలగించడానికి దీని ఆకులను సబ్బులో కలిపి వాడతారు. అలాగే దీని ఆకులకు క్రిమిసంహారక లక్షణాలు కూడా ఉన్నాయి.
నాటుకుంటే అదృష్టమే.. వాటర్‌క్యాబేజీని కొన్ని ప్రాంతాల్లో తింటారు కూడా. దీనికి ఔషధ లక్షణాలూ ఉన్నాయి. వాపులకూ, మూత్ర సంబంధిత వ్యాధులకూ, ఉబ్బసానికీ, కడుపునొప్పికి దీన్ని మందుగా వాడతారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను జలకుంభి అంటారు. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు వాటర్‌ క్యాబేజీని తీసుకెళ్లి నాటుకుంటే అదృష్టం అనీ నమ్ముతారు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....