అది పెద్ద పొదా లేక చిన్న చెట్టా లేక తీగలా సాగే పొదా అని మనల్ని తికమక పెడుతూనే...ఏదైతే ఏమిటి పూలు మాత్రం అద్భుతం అనిపించే ప్రత్యేకమైన మొక్క నిమ్మపచ్చ కార్డియ.
దీన్ని ఎల్లో కార్డియా లేదా ఎల్లో గీజర్ అనీ అంటారు. పెరూ దీని జన్మస్థానం కావడంతో పెరుకార్డియా అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం కార్డియా ల్యూటియా. ఎల్లో కార్డియా పది నుంచి పదిహేను అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. దీని కొమ్మలు నూగుతో నిండి ఉంటాయి. ఆకు పై భాగం గరుకుగా, అడుగుభాగం నూగుతోనూ ఉంటుంది. కొద్దిపాటి సువాసనతో ఉండే దీని పూలు కొమ్మల చివర చిన్న గుత్తుల్లో పూస్తాయి. ఇవి కప్పు ఆకారంలో చిన్నగా, ప్రకాశవంతమైన నిమ్మపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పసుపు రంగులో పూలు పూసే చెట్లు అనేకం ఉన్నా ఈ ఎల్లో కార్డియా పూల రంగు ప్రత్యేకంగా ఉంటుంది. వేలాడే కొమ్మలతో బలమైన తీగలా భ్రమింపచేసే దీన్ని ప్రూనింగ్ ద్వారా కుదురుగా పెంచుకోవచ్చు. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండి సంవత్సరం పొడవునా పూస్తుంది.
వేగంగా పెరుగుతుంది... ఎల్లో కార్డియాకు పూర్తి వెలుతురు కావాలి. సముద్ర తీరపు ఉప్పునేలలో సహా ఎలాంటి నేలలోనైనా చక్కగా పెరుగుతుంది. నేల మరీ సారవంతంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే నీరు నిలవకుండా ఉండాలి. దీనికి నీళ్లు కొద్దిగా పోసినా చాలుగానీ క్రమం తప్పకుండా పోయాలి. ఇది పెద్దగా శ్రద్ధ అవసరం లేని మొక్క. దాదాపు చీడపీడల భయం లేనట్లే. ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు. అయితే వేగంగా పెరుగుతుంది. ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది కనుక ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును నెలకోసారి కొద్దిగా వేస్తుంటే మంచిది.
ఎల్లోకార్డియా ప్రత్యేక మొక్కగా పెంచుకోవడానికి బాగుంటుంది. కొమ్మలకు ఉండే వేలాడే వల్ల చెట్టు కింద ఇంకెలాంటి నేలబారు మొక్కలు పెంచుకోకపోవడమే మేలు. ముంగిట్లో చక్కగా కత్తిరించుకుని చిన్న చెట్టులా పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అయితే నీడ పడే దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ మొక్క అందమంతా దీని పూలే. ఈ పూలు సీతాకోక చిలుకలను కూడా బాగా ఆకట్టుకుంటాయి. కార్డియాలోని ఇతర రకాలు సెబాస్టినా, సుపర్బా, డోలికాండ్రా అన్నీ ఆకర్షణీయమైనవే. ప్రత్యేకమైనవే. అయితే ఎల్లో కార్డియా పూలు ఇంకొంచెం నాజూగ్గా, ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఎల్లోకార్డియాను కొమ్మంట్లూ, కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....