Zeebra Flower Plants....అందమైన జీబ్రా మొక్కలు
మనం సాధారణంగా చూసే మొక్కలలో చాలావరకు పువ్వులు లేకపోతే ఆకులలో ఏదో ఒకటి అందంగా ఉంటుంది. రెండూ అందంగాఉండే మొక్కలు చాలా అరుదు. జీబ్రా మొక్క అలాంటి అరుదైనది. ముదురాకు పచ్చరంగు మీద ప్రస్పుటంగా కనిపించే తెల్లని చారలున్న ఆకులు దీని సొంతం. ఇవి జీబ్రాని తలపిస్తాయి కాబట్టే ఈ మొక్కలకు ఆపేరు. దీని శాస్త్రీయనామం స్వ్కారోజా. అందుకే ఎపిలాండ్రా అనికూడా అంటారు. ఇది నీడలో పెరిగేమొక్క. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోకూడా చక్కగా పెంచుకోవచ్చు. సాధారణంగా రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద ఇది. వీటిని నీడలో నాటుకున్నా కుండీలలో పెంచుకున్నా బాల్కనీలు, వరండాలలో ఎక్కడ పెట్టుకున్నా ఆకట్టుకుంటుంది.
పూల, ఆకుల సోయగం :
జీబ్రా ఆకులు అందమైన చారలతో దాదాపు తొమ్మిది అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పుతో మొనదేలిన శీర్షంతో ఉంటాయి. బంగారు రంగులో శంఖాకారపు గుర్తుల్లో మురిపించే దీనిపూలు...అసలు పూలు కావు. అవిరూపాంతరం చెందిన బ్రాక్టులు. అసలు పూలేమో సన్నగా బంగారురంగులో ఉంటాయి. పూసిన వారం రోజులలోనే రాలిపోతాయి. బ్రాక్టులు మాత్రం ఐదునుంచి ఆరువారాలపాటు కనువిందుచేస్తూ ఉంటాయి. జాబ్రామొక్క సాధారణంగా శీతాకాలంలో పూస్తుంది. నీడలోనే చక్కగా పెరిగినా...కొంత సూర్యకాంతి, కనీసం కృత్రిమ కాంతి అయినా తగలనివ్వాలి. గాలిలో తేమ కూడా ఎక్కువగాఉండాలి. తడిగా ఉండి నీరు నిలవనిమట్టి మిశ్రమం కావాలి. కోకోపిట్, వేపపిండి, కంపోస్టు లేదావర్మీకం పోస్టు కొద్దిగా ఇసుక కలిసిన మట్టిమిశ్రమం ఉపయోగించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి ....
కొద్దిగా అశ్రద్ధచేసినా ఆకులు రాలిపోయి పీలగా మారిపోతుంది. నీటిలో లవణాలు ఎక్కువగా ఉన్నా దెబ్బతింటుంది. ఆకులు రాలిపోతున్నట్లయితే నేల పొడిబారడమో ఎండ ఎక్కువ కావడమో కారణాలు కావచ్చు. ఆకు చివర్లు విడిపోతుంటే గాలిలో తేమ తక్కువైందని గ్రహించాలి. వెంటనే మొక్క చుట్టూ గాలిలోని నీళ్ళు పిచికారీ చేయాలి. లేదా కుండీ కింద ప్లేటులో గులకరాళ్ళు పోసి తడుపుతూ ఉండాలి. జీబ్రా మొక్కకు రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువ. వేప, పొగాకు, కానుగ కషాయాలు చల్లుకోవాలి. పూలు వాడిపోగానే కత్తిరించుకోవాలి. కొమ్మలను అప్పుడప్పుడు కిందికి కత్తిరించాలి. దీనివల్ల మొక్క సాగిపోయినట్లు కాకుండా ముద్దుగా గుబురుగా పెరుగుతుంది. చాలా మొక్కలలో సూర్యకాంతి చాలకపోతే కృత్రిమ వెలుతురును ఎక్కువ, తక్కువ సేపు పడేలా చేయడం ద్వారా పూలుపూసే సమయాన్నిపెంచవచ్చు. కానీ జీబ్రా మొక్క మాత్రంకాస్త ప్రకాశవంతమైన వెలుతురు ఉంటేనే పూలు పూస్తుంది.వెలుతురు మరీఎక్కువైతే ఆకులు ముడుచుకుపోతాయి. ఇది చిన్నకుండీలోనే బాగాపూస్తుంది. అందుకే కుండీ మార్చటానికి తొందరపడక్కరలేదు..
ఆకులను అప్పుడప్పుడు తడిగుడ్డతో తుడుస్తూ ఉంటే మొక్క చక్కగా కనపడుతుంది. నెలకు ఒకసారి ఎన్ పి కె ఉండే 17:17:17 శాతం చొప్పున సమగ్ర ఎరువును అందిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. కొమ్మల శీర్షిక కత్తిరింపుల ద్వారా దీనిని ప్రవర్ధనం చేయవచ్చు.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...