header

Zinia Flower Plants…బంగళాబంతి.. జినియా

Zinia Flower Plants…బంగళాబంతి.. జినియా

మనోహరమైన వర్ణాల్లో అందమైన పూలతో పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చేసే ఏకవార్షికాల్లో జినియాకు ప్రముఖస్థానం ఉంది. దీని శాస్త్రీయనామం జినియా ఎలిగెన్స్. దీన్ని కామన్ జినియా అనీ ఎలిగెంట్ జినియా అనీ, బంగళాబంతి అనీ అంటారు.
మెక్సికోలో పుట్టినా ప్రపంచమంతా చుట్టేసిన అందమైన మొక్క ఇది. జినియా ఎలిగెన్స్ రెండడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీనిని వర్షాకాలంలో పెంచుకుంటారు. కానీ పూర్తి ఎండకావాలి. ప్రోట్రేలలో నారు పోసుకుని నాటుకున్నా, కావలసిన చోట విత్తనాలను చల్లుకున్నా ఫరవాలేదు. నాటిన ఐదారు రోజుల్లో మొలకెత్తుతాయి.
తుంచితే ఎక్కువ పూలు... జినియాలో ముద్ద రకాలతో పాటు ఒంటిరెక్క రకాలూ ఉన్నాయి.. తెలుపూ, పసుపూ, గులాబీ, వూదా, నారింజా, ఎరుపు రంగుల్లో పూస్తుంది. ఇన్ని వర్ణాల్లో ఎక్కువ పూలు అధిక కాలంపాటు పూయడం, అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండటం జినియాకే చెల్లింది. మొక్కలు నాటుకున్న తరవాత నాలుగైదు వారాలకోసారి నీటిలో కరిగే పాలీఫీడ్ వంటి సమగ్ర ఎరువును లీటరు నీటికి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఐదుగ్రాముల చొప్పున, పూలు రావడం మొదలయ్యాక పది గ్రాముల వంతున కలిపి పోస్తూ ఉండాలి. లేత మొక్కల తలలు తుంచితే ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి.
సారవంతమైన మట్టిమిశ్రమంతో...
జినియా నీళ్లు పోసేటప్పుడు ఆకుల మీద కాకుండా మొదళ్ల దగ్గర పోసేలా జాగ్రత్త తీసుకోవాలి. దీనికి సాయంత్రాలు కాకుండా ఉదయం పూట నీళ్లు పోయడం మంచిది. మొక్క ముదిరే కొద్దీ నీళ్లు తగ్గించవచ్చు. దీన్ని బోర్డరుగానూ, గుంపుగానూ, ఇతర మొక్కలతో కలిపి నాటడానికీ, పెంచుకోవడానికీ కూడా ఎంచుకోవచ్చు. కుండీల్లోకి పొట్టి రకాలు నప్పుతాయి.
ఫ్లవర్ వాజుల్లో అలంకరించుకోవడానికి కూడా బాగుంటాయి. బూడిద తెగులుతోపాటు వాడు తెగులూ, ఆకుమచ్చా, రసం పీల్చే పురుగులూ, పిండి పురుగుల కూడా జినియాను ఆశించవచ్చు. మొక్కలకు బాగా గాలి తగిలేలా చూసుకోవాలి. సారవంతమైన మట్టి మిశ్రమాన్ని వాడటంతో పాటు క్రమపద్ధతిలో ఎరువులు వేసి, ఆకు కషాయాలను చల్లాలి. ఆకులు పొడిగా ఉండేలా చూస్తే జినియా కూడా మీ తోటను ముచ్చటైన పూలతో నింపేస్తుంది. ఇది తేనెటీగలకూ, సీతాకోక చిలుకలకు కూడా ప్రియనేస్తమే.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....