header

Ziranium Aleria

ఆకులు ఆకర్షణీయం... జిరానియం అరేలియా

ఆకులే ఆకర్షణగా... వ్యావహారికంగా మనం అరేలియా అని పిలిచే రకాల్లో జిరానియం అరేలియా కూడా ఒకటి. దీని శాస్త్రీయనామం పాలీషియాస్‌ గుల్‌ఫోలి. దీన్నే రోజ్‌లీఫ్‌ అరేలియా అని కూడా అంటారు. దీని ఆకులు గులాబీ ఆకుల్ని పోలి ఉంటాయి.
ఇంట్లోనూ, వరండాల్లోనూ, బాల్కనీల్లోనూ పెంచుకోవడానికి అనువైన మొక్కల్లో జిరానియం అరేలియా ముఖ్యమైనది. ఇది అందంగా ఉంటుంది. పెంచడం సులువు. పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేదు కూడా. అందుకే ఆఫీసుల్లోనూ, హోటల్‌ లాబీల్లోనూ జిరానియం అరేలియా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.
నాలుగు మీటర్ల ఎత్తులో...
జిరానియం అరేలియా చిన్నపొద. ఇది గుబురుగా కంటే నిటారుగా పెరుగుతుంది. కొమ్మలు సాధారణంగా ఎక్కువగా ఉండవు. ఇది మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. ఎప్పుడూ నిండుగా ఆకులతో ఉండే ఈ మొక్కను కత్తిరించి కావలసిన సైజులో పెంచుకోవచ్చు. అండాకారంలో ఉండే దీని ఆకులు సాధారణంగా తెలుపు లేదా లేత పసుపు రంగు అంచులతో ఉంటాయి. పూర్తి ఆకుపచ్చ రకాలు కూడా ఉన్నాయి.
ఆకు అంచులు రంపపు పళ్లలాగా ఉంటాయి. కొంచెం ఎక్కువ చీలికలతో ఉండే ఆకుల రకాలు కూడా ఉంటాయి. అలాగే బోన్సాయ్‌లాగా కనిపించే పొట్టి రకాలు కూడా ఉన్నాయి. అందమైన ఆకులే దీనికి ప్రధాన ఆకర్షణ.
నీరు నిలిచి ఉండకుండా...
జిరానియం అరేలియా ఎండలో పెరిగినా నీడలో చక్కగా పెరుగుతుంది. ఎలాంటి వాతావరణంలోనైనా, నేలలోనైనా సులువుగా పెరుగుతుంది. నీరు నిలవని మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. కుండీల్లో పెంచినప్పుడు కుండీ అడుగున ప్లేట్లలో నీరు నిలవనివ్వకూడదు. ఎత్తైన బోర్డరుగా పెంచుకోవడానికి బాగా అనువుగా ఉండే ఈ మొక్కను పక్క పక్కన నాటుకుని అడ్డుగోడలాగా పెంచుకోవచ్చు.
ఇతర మొక్కలతో కలిపి నాటుకోవడానికీ, కుండీల్లో పెంచుకుని ప్రత్యేకంగా గానీ, గుంపులో గానీ అమర్చుకోవడానికీ చాలా బాగుంటుంది. లాండ్‌స్కేప్‌ రూపకల్పనలో ఇలాంటి మొక్కలు సులువుగా ఇమిడిపోయి అందాన్నీ, ఆకర్షణనూ పెంచడంతో పాటు ఎక్కువ శ్రమలేకుండా చేస్తాయి.
కత్తిరింపుల ద్వారా... జిరానియం అరేలియా ఆరోగ్యంగా పెరిగేందుకు రెండు మూడు వారాలకొకసారి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును కొద్దికొద్దిగా వేస్తూ ఉంటే సరిపోతుంది. కొత్త చిగుళ్లను రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఆకు కషాయాలు చల్లుతూ ఉండాలి. అప్పుడప్పుడూ ఆకుల మీద నీళ్లు పిచికారీ చేస్తే ఉంటే మొక్క ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
జిరానియం అరేలియాను కత్తిరింపుల ద్వారా, కొమ్మంట్ల ద్వారా సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. మొక్కల పెంపకం మీద అంతగా అవగాహన లేనివారికి కూడా ఇది చక్కని ఎంపిక.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....