అత్తిపండు మంచి ఔషధ ఫలం. అచ్చం మేడిపండు లాగే ఉంటుంది. లోపల అన్నీ గింజలే. అత్తి పండునే హిందీలో అంజీర్ అని ఇంగ్లీష్‌లో ఫిగ్ అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలు కలిపి చేసే జ్యూస్‌కి అంజీర్‌ని (ఎండుదయినా పండుదయినా సరే) మించిన కాంబినేషన్ మరొకటి లేదు. అద్భుతమైన రుచితోపాటు పోషకాలు అందుతాయి. ఎనిమీయాతో బాధపడే వాళ్లకి ఈ పండ్లను పాలతో కలిపి తీసుకుంటే రక్తం బాగా పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డ్రైఫ్రూట్స్‌గా అంజీర్ వాడకం ఎక్కువ. కేకులు, స్వీట్లు, మిల్క్‌షేకుల్లో ఎక్కువగా వాడతారు.
అనేక ప్రాంతాలలో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అంజీర్‌ను ఎండురూపంలో గానీ పండుగా గానీ తిసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. జ్వరం వచ్చి తగ్గిన వెంటనే రెండు అంజీర్ లను తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి రెండూ వస్తాయి.
ప్రయోజనాలు: వ్యాధులను నిరోధించడమే కాదు. నివారించేందుకూ దోహదపడతాయి. శారీరక మానసిక సమస్యలను తగ్గిస్తాయి. క్యాన్సర్ తరహా గడ్డలను నివారిస్తాయి. వీటిలో అధికంగా ఉండే పొటాషియం బీపిని తగ్గిస్తుంది. ఈ పండ్లు మధుమేహం, బ్రాంకైటిస్, ఆస్తమా, దగ్గు, వంటి వ్యాదులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలకి ఇవి మంచి మందుగా పనిచేస్తాయి. కోరింత దగ్గు, ఆస్తమాతో బాధపడే వాళ్ళు వీటిని రోజూ తింటే ఎంతో మంచిది. లైంగిక బహీనతలను తగ్గిస్తాయి.
రోమన్లు వీటిని సంతానాన్ని ఇచ్చే దేవత వరంగా భావించి సంతానం కోసం దంపతులకు ఈ పండ్లను కానుకగా ఇచ్చేవారట. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి బహీనంగా మారిన వాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. ఈ పండ్లలోని పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెనోపాజ్ తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్ నివారణకీ ఉపయోగపడుతుంది. మలబద్దకానికి ఈ పండు మంచి మందు అజీర్తిని తొలగిస్తుంది. వీటిలో అధికంగా ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి పుష్టికి దోహదపడుతుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్ళు రోజూ రాత్రిపూట రెండుమూడు అత్తిపండ్లు తిని పాలుతాగితే మంచి నిద్ర పడుతుంది.ఇందులోని జిగురు గొంతునొప్పిని పుండ్లనీ హైపర్‌టెన్ష్‌న్‌ను తగ్గిస్తుంది.
వృద్దాప్యం వలన వచ్చే దృష్టిలోపాలను ఈ పండ్లు తగ్గిస్తాయి. ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వలన హృద్రోగ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర్ డ్రైఫ్రూట్‌లో ఐరన్ చాలా ఎక్కువ డీసెంట్రీ, హెపటైటిస్ వ్యాధుల నివారణకు వీటిని తేనెతో కలిపి తీసుకోమని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. అలాగే కడుపునొప్పి, జ్వరం, చెవినొప్పి, లైంగిక వ్యాధుల్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి. రోజూ రెండు అంజీర్ పండ్లను తింటే ఆరోగ్యం మీ సొంతం.