మృధుమధురమైన పండ్లు ద్రాక్ష. ఒకప్పుడు నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వీటిలో అనేకరకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ద్రాక్షలో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగిన పాలీఫినాలిక్ ఆమ్లాలు విటమిన్లు దండిగా ఉన్నాయి. రోజుకు కాసిని ద్రాక్ష పండ్లు తింటే వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చుంటున్నారు పోషకహార నిపుణులు.మాంగనీస్ పొటాషియం, విటమిన్-సి, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ విటమిన్లు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా వీటిలో ఉండే రెస్‌వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కోన్, ప్రొస్టేట్ క్యాన్సర్లనీ హృద్రోగాలను, నాడీ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. రెడ్‌వైన్‌లో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ కారణంగానే మాంసాహారం ఎక్కువగా తీసుకునే ఫ్రెంచ్ దేశస్దులలో హృద్రోగాలు చాలా తక్కువ. కానీ మరీ అతిగా వైన్ తీసుకోకూడదని వైద్యుల హెచ్చరిక. ఈ యాంటీ ఆక్సిడెంట్లు, గుజ్జులో కన్నా తొక్క, గింజలలోనే వందశాతం ఎక్కువ. ఎరుపు రంగు ద్రాక్ష గింజల నుండి వేరుచేసిన కొన్ని పదార్థాలను పరిశీలించగా వీటికి ఈస్ట్రోజన్ కారణంగా తలెత్తే క్యాన్సర్లను నివారించే శక్తి ఉందని తేలింది. వీటిల్లోని క్వెర్‌సిటిన్, శాపోనిన్ లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అన్నింటికన్నా వంగ రంగు ద్రాక్షాలో యాంటీ ఆక్సిడెంట్స్ మరింత ఎక్కువ. లేతాకు పచ్చ ద్రాక్షాలో ఉండే కెటెచిన్స్ కూడా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
ద్రాక్షలోని రెస్‌వెట్రాల్ అల్జెమర్స్‌ని నివారించడంతో బాటు ఇతరత్రా నాడీసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఉదయాన్నే నీళ్లు కలపని ద్రాక్షారసం తాగితే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుందంటారు. అజీర్తిని, పొట్టలోని మంటను ద్రాక్షారసం నివారిస్తుంది.
ద్రాక్షలో ఉండే ల్యూటెన్, జియాక్సాంథిన్ కళ్లకు ఎంతో మంచివి. ఈ పండ్లలోని టిరోస్టిల్బీన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరుని మెరుగు పరుస్తుంది. సాధారణంగా కఫ బాధితులకి ద్రాక్ష మంచిది కాదనుకుంటారు. కానీ ఇవి ఊపిరితిత్తులోని తేమను పెంచి ఆస్తమా నివారణకు ఉపయోగ పడతాయి.ద్రాక్షలోని గ్లూకోజ్, ఆర్గానిక్ ఆమ్లం, పోలియోజ్ లు మలబద్దకాన్ని నివారిస్తాయి.
పడుకునే ముందు ఓ గ్లాసు ద్రాక్షారసం తాగితే పగలంతా పడిన ఒత్తిడి పోయి హాయిగా నిద్రపడుతుంది. తాజా ద్రాక్షాతో పోలిస్తే ఎండుద్రాక్షాలో గ్లూకోజ్ ఎక్కువ. వంద గ్రాముల కిస్మిస్‌లో 300 క్యాలరీల శక్తి లభిస్తుంది. అయుతే ఎండు ద్రాక్షాలో యాంటీ ఆక్సిండెంట్ల శాతం తాజా వాటిల్లో కన్నా తక్కువ. దాక్షపండ్ల మీద తెల్లని పూత క్రిమిసంహారక మందు కాదు. ఇది సహజమైనది. దీన్నే బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా, ఫంగస్ వంటివి పట్టకుండా ఉండేందుకు ఈ బ్లూమ్ తోడ్పడుతుంది.