header

Jamboo Fruits

ఏడాదిలో ఓ రెండు మూడు నెలలు మాత్రమే కనిపించే నేరేడు పండును చూడగానే చాలామందికి ప్రాణం లేచొస్తుంది. ఎందుకంటే ఇది పండు కాదు, ఓ అద్భుత ఔషధం. ముఖ్యంగా మధుమేహులకి పరమౌషధం. మన పురాణాలు సైతం దేవతాపండుగా పేర్కొనే ఈ పండులో రోగనిరోధకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. అందుకే ఈ పండ్లు అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి, నివారిస్తాయి.
నేరేడు బెరడు కడుపులోని పనికిరాని వాయువులును దూరం చేస్తుంది. అరుగుదలను పెంచుతుంది.
గొంతునొప్పి, శ్వాసకోసవ్యాధులు, ఉబ్బం, దాహం, రక్తవిరోచనాలు, రక్తంలోని మాలిన్యాలు, పుండ్లు తగ్గటానికి నేరేడు పండ్లు దోహదం చేస్తాయి.
అతిసారం తగ్గించడం కోసం నేరేడు గింజలపొడిని, మామిడి గింజల పొడితోనూ, బెల్లం కలిపి వాడతారు.చీము పట్టిన పుండ్లపై నేరేడు ఆకులను నూరి కట్టుకడితే అవి తొందరగా మానతాయి.
ఈ పండ్ల రసం మొలల వ్యాధుల్ని తగ్గిస్తుంది. క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడేవాళ్లకీ ఈ పండ్లు మందులా పనిచేస్తాయి.
ఈ పండ్లు తింటే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. చిగుళ్ల వ్యాధుల్ని నివారిస్తుంది. ఈ చెట్టుకొమ్మల్ని కాల్చిన బూడిదతో దంతాల్ని రుద్దితే అవి ఎంతో దృఢంగా ఉంటాయట.
ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి టీస్పూను పొడితో కలిపి ఈ పండ్లరసాన్ని తీసుకుంటే అల్సర్లు తగ్గుముఖం పడతాయి.
రక్తశుద్ధికీ కాలేయరోగులకీ ఇవి ఎంతో మంచివి. పండ్లలోని సహజ ఆమ్లాలు జీర్ణశక్తికి కారణమైన ఎంజైమ్‌ల ఉత్పత్తికి దోహదపడతాయి. పండ్లే కాదు, గింజలూ, చెట్టు బెరడూ, ఆకులూ అన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎండిన గింజల పొడితో చేసిన డికాక్షన్‌ అలసటనీ నీరసాన్నీ మాయం చేస్తుంది. అజీర్తి, తేపులతో బాధపడేవాళ్లకి ఈ గింజలతో చేసిన పొడి ఎంతో మేలు. ఈ పండ్లతో చేసిన రసంలో అరటీస్పూను బెరడుపొడి కలిపి రోజూ తాగితే మూత్రనాళ సమస్యలన్నీ తొలగిపోతాయి.
గింజలతో చేసిన పొడిని పసుపుతో కలిపి మచ్చలమీద పెడితే తగ్గుతాయి.
చెట్టు బెరడుతో చేసిన పొడి పొట్టలోని బద్దెపురుగుల్ని నివారిస్తుంది.
మధుమేహ (సుగర్) జబ్బున్నవారు నేరేడు కాయలను, నేరేడు గింజల పొడిని రోజూ వాడుతుంటే రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ చాలాకాలం సాగాలి. కొద్దిరోజుల పాటు వాడితే పనిచేయదు.
అందుకే అంటారంతా... ఇంటింటా ఓ నేరేడు చెట్టు ఉంటే ఆరోగ్యానికి అదే తొలిమెట్టు అని..!