సపోటా ఉష్ణమండలపు పంట. దీని జన్మస్థానం మెక్సికో. అక్కడ నుండి ఇతర దేశాలకు వ్యాపించింది. సంవత్సరంలో రెండుసార్లు కాస్తుంది. దీనిలో లాటెక్స్ అధికంగా ఉండటం వలన దీనిని కోసేంత వరకు పండదు. కొన్నిపండ్లు గుండ్రంగా, కొన్ని కోడిగుడ్డు ఆకారంలోనూ ఉంటాయి. సపోటా చాలా తియ్యగా ఉండి ఆరోగ్యానిచ్చే రుచిగల పండ్లలో ఒకటి. భారతదేశం, పాకిస్తాన్, మెక్సికో దేశాలో సపోటాలను ఎక్కువగా పండిస్తారు.
సపోటాలో ఉండే పీచు మంచి సుఖ విరోచనకారిగా పనిచేస్తుంది. దీనిలోని పీచు మలబద్దకాన్ని తగ్గించి పెద్దపేగులలోని మ్యూకస్ పొరను కాపాడి దానిద్వారా క్యాన్సర్‌కు కారణమయ్యే విషాలను దూరం చేస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలీఫెనోలిక్ మిశ్రమం టానిక్ ఉంది. టానిక్ ఆమ్లాన్ని నిష్ఫలం చేసే ప్రోటీన్ల ద్వారా పనిచేసే ఫాలీఫెనాల్స్ కుటుంబానికి చెందినది.
బాక్టీరియాకు వ్యతిరేకంగా, వైరస్‌కు వ్యతిరేకంగా, పరాన్నభుక్తులకు వ్యతిరేకంగా, నొప్పులను, మంటలను తగ్గించే గుణం వల్ల గ్యాస్ట్రయిటీస్, ఇతర అన్నవాహిక నొప్పిని, చిన్నపేగుల నొప్పిని, ఇతర పేగుల్లోని ఇబ్బందులను తగ్గించటంలో సహాయ పడుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
సపోటాలో విటమిన్ సి రోజువారీ అవసరంలో 24.5 శాతం కలిగి వుంది. దీనిలో విటమిన్ ఎ కూడా ఉంది. కంటిచూపుకు విటమిన్ ఎ అవసరం. అలాగే ఆరోగ్యవంతమైన చర్మం కోసం, మ్యూకస్ పొర సరిగ్గా ఉండటం అవసరం.
ప్రకృతి సిద్ధమైన పండ్లను విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న వాటిని తినటం ద్వారా ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే విటమిన్ సి తో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడి వివిధ రకాల అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించటానికి, చెడు చేసే ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించటానికి సహాయపడుతుంది.
పండిన తాజా సపోటాలో పొటాషియమ్, రాగి, ఇనుము మొదలైన మినరల్స్, ఫాలేట్, నైసిన్, పాన్‌టోథెనిక్ ఆమ్లం మొదలయిన విటమిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి జీవన ప్రక్రియు సరిగ్గా జరగటానికి చాలా అవసరం. వీటిలో ఇన్ని లాభాలు, పోషకాలు ఉన్నాయి కాబట్టీ ఇవి వండర్ ఫ్రూట్స్. ఇందులో చక్కెర శాతం అధికం కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు. లేదా డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి.