header

Sweet Lemon….బత్తాయి పండు

చూడ్డానికి పెద్ద సైజు నిమ్మపండులా ఉండే బత్తాయి పండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తియ్యగా వుంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో వుంటుంది. చాలామంది ఒలుచుకొని తిన్నప్పటికి జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికి ఈ పండ్లే గుర్తుకొస్తాయి.
పోషక విలువలతో పాటు, ఔషథపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు. జ్వరం వంటివి వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లరసాన్నే అందిస్తారు. విటమిన్‌ సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్‌ సి ఎక్కువపాళ్ళలో దొరుకుతుంది.
ఈ పండుకున్న తీపి వాసన లాలాజ గ్రంధులను ప్రేరేపించి లాలాజలం అధికంగా వూరేందుకు కారణమౌతుంది. ఇందులోనే ప్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌ మీద వున్న రోగులు కోలుకునేందుకు బత్తాయి రసాన్నే ఇస్తుంటారు.
ఉదయాన్నే యోగ, జాగింగ్‌, వాకింగ్‌ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు...అలిసిన శరీరం వెంటనే శక్తివంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాస్‌ బత్తాయిరసం తీసుకోవడం ఎంతోమంచిదని పోషకనిపుణు సూచించేది ఇందుకే.
ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగులలోని విషపూరిత పదార్ధాల్ని పారదోలతాయి. అందువల్ల అజీర్తితో బాధపడేవాళ్ళకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం, డయోరియా, డిసెంట్రి... వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతో పాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు వచ్చిన వాళ్ళకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది. బత్తాయి పండు రుచి వాంతుల్ని అరికట్టి తలతిరగడాన్ని తగ్గిస్తుంది.
ఈ జ్యూస్‌ తాగడం వల్ల చిగుళ్ల నెప్పులు, గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు ఈ జ్యూస్‌ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దానితో రక్తప్రసారం చక్కగా వుండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా బాగుంటుంది. ఇందులోని లిమోనాయిడ్లు ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయడంలోను రక్షించడంలోను కీలకపాత్ర వహిస్తాయి.
బత్తాయిరసం చర్మానికి మంచిది. క్రమం తప్పక తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేసి, చర్మం మెరుపును సంతరించుకునేలా చేస్తుంది.
ఆటలాడి వచ్చిన పిల్లలకు కూడా రాగానే తాజా బత్తాయి రసాన్ని ఇస్తే దాహం తీరి స్ధిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయి రసాన్ని మించింది లేదు.