వజ్రాల అందం, ఆకర్షణ వాటి మెరుపులో ఉంటుంది. కాబట్టే వజ్రాల నగలఎంపికలో రాళ్ల మెరుపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం వజ్రాల కలర్ గ్రేడింగ్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి!
వజ్రాల రంగు గ్రేడింగ్ ‘డి’ మొదలుకుని ‘ఎమ్’ వరకూ ఉంటుంది. ‘డి’
గ్రేడ్ వజ్రాల మెరుపు స్పష్టంగా, మిరిమిట్లు గొలుపుతూ ఉంటుంది. గ్రేడ్
తగ్గే కొద్దీ తెలుపు రంగు పసుపు రంగుకు మారుతూ ఉంటుంది.
డి... ఆతర్వాత ‘ఇ’, ‘ఎఫ్’ గ్రేడ్ వజ్రాలు కూడా బాగుంటాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఈ గ్రేడ్లు రెండూ విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఉత్తర భారతంలో అంతకంటే తక్కువ గ్రేడ్‌లే వాడుకలో ఉన్నాయి.
ధరలు ఎలా ఉంటాయి...?
ఒక కేరట్ ఇ, ఎఫ్ రకం గ్రేడ్ వజ్రాల ధర రూ. 46 నుంచి 52 వేలు ధర
పలుకుతాయి. అంతకంటే తక్కువగా దొరికాయంటే, అవి ఇ, ఎఫ్
రకానికి చెందిన వజ్రాలు కాకపోవచ్చు. లేదా కేరట్ బరువులో తక్కువ
కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది. డి రకం వజ్రాల ధర కేరట్‌కు
రూ. 56 నుంచి 65 వేల వరకూ ఉంటుంది. అయితే ఇంత ధర పెట్టినా,
ఇ, ఎఫ్ రకం వజ్రాలకూ వీటికీ పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. కాబట్టే ఇ, ఎఫ్ రకం వజ్రాలకే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. అయితే ఏ గ్రేడ్ వజ్రాలు కొన్నతరువాత, ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
వజ్రాలకు నూటికి నూరు శాతం మార్పిడి ఉంటుంది. అయితే ఎక్కువ ధర పెట్టి, భారీ వజ్రాల నగలు మార్పిడి సమయంలో 10శాతం తక్కువ రిటర్న్ వేల్యూ పొందవలసి రావచ్చు. కాబట్టి ఇ, ఎఫ్ రకం వజ్రాలతో తయారైన చిన్న నగలు కొనడం మేలు. సాలిటైర్స్‌లో ఇ, ఎఫ్‌తో పాటు జి వరకూ రంగులు బాగుంటాయి. క్లోజ్ సెటింగ్ డైమండ్స్‌లో రాళ్ల అడుగున సిల్వర్ వేస్తారు కాబట్టి రాళ్లు మరింత మెరుపును సంతరించుకుంటాయి.
కాబట్టి ఇ, లేదా ఎఫ్ గ్రేడ్‌కు చెందిన వజ్రాల నగలను నిస్సంకోచంగా
ఎంచుకోవచ్చు.
సహజమైన వజ్రాలు భూమిలోపల అపారమైన వత్తిడి, వేడివలన ఏర్పడతాయి. వజ్రాలను కృత్రిమంగా కూడా తయారు చేస్తారు. ఇవి అచ్చం భూమిలో లభ్యమయ్యే వజ్రాల లాగానే ఉంటాయి. నిపుణులైన వజ్రాల నిపుణులు కూడా వీటిని కనిపెట్టలేరు. కానీ కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా కనిపెట్టవచ్చు.