అన్నమయ్య లేక తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రపకారం మొదటి వాగ్గేయకారుడు. ఇతను శ్రీవేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు. వాగ్గేయకారుడికి అర్ధం సాధారణ భాషలో గేయాలను కూర్చేవాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. గొప్ప వైష్టవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్టవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ, 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు.
అన్నమయ్య జీవిత కాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.
అన్నమయ్య సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీవైష్ణవ సాంప్రదాయంవారు నమ్ముతారు. త్యాగయ్య, క్షేత్రయ్య, భక్తరామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే, జాబిల్లిరావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం వెంటనే తింటారు. జో అచ్చుతానంద, జో జో ముకుంద...లాలిపాటలు తెలుగు తల్లుల నోళ్ళలో నానుతుంది. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళపాటలు, శృంగారగీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా మొత్తము ముప్పై రెండువేల పాటలు వ్రాసాడు. అన్నమయ్య జీవితం గురించి ఆధారం అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న వ్రాసిన అన్నమాచార్య చరితము అన్న ద్విపదకావ్యములో పొందుపరచారు. ఈ గ్రంధము 1948లో లభ్యమై ముద్రించబడినది.
అన్నమయ్య తాత నారాయణయ్య, తండ్రి నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. వీరికి చాలా కాలం సంతానం కలుగులేదు. ఈ దంపతులు సంతానార్థులై తిరుమలను దర్శించారు. సర్వధారి సంవత్సరం వైశాఖశుద్ధ పూర్ణిమ నాడు మే 9, 1408 కడపజిల్లాలోని రాజంపేట మండలంలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు.
అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగినాడు. ఏకసంధాగ్రాహి అవటం వలన అనతి కాలంలోనే ఉన్నత విద్యావంతుడయ్యాడు. అన్నమయ్యకు 16వ ఏటనే శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. ఒకనాడు ఎవరికి చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరినాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో ఎక్కుతూ ఒకచోట అలసిపోయి ఒక వెదురుపొదలో నిద్రపోయాడు. అప్పుడు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది. పరవశించిన అన్నమయ్య అలివేలు మంగమ్మను కీర్తిస్తూ శ్రీవేంకటేశ్వర శతకమును రచించాడు. తిరుమల శిఖరం చేరుకున్న అన్నమయ్య అక్కడ అన్నిటిని దర్శించి మ్రొక్కి ఆ రాత్రి ఒక మండపంలో నిద్రించాడు. తరువాత కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.
తిరుమలలో ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఘు చక్రములతో శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బ్రతిమాలారు. గరువాజ్ఞపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. అతనికి యుక్తవయసు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు. అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించారు. ఆ సమయంలోనే స్వామికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.
అప్పటినుండి అన్నమయ్య వేలకొలది కీర్తనలు గానం చేశారు. వాటిని శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో లిఖించసాగారు. ఆ తరువాత అన్నమయ్య భార్యలతో కలసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అన్నమయ్య కీర్తనలు అంతటా ప్రసిద్ధి పొందాయి. పెనుగొండ ప్రభువైన సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. హరిని హరిని కీర్తించే చోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందుకు అన్నమయ్యను చెరసాలలో ఉంచాడని అంటారు. తరువాత రాజాశ్రయం తనకు తగదని గమనించి తిరుమలకు చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో ఆధ్యాత్మిక గీతాలు అధికంగా రచించాడు. అన్నమయ్య వెంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే ఆగ్రహారంలో నివసించేవాడు. క్రమంగా జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలో కాలం గడిపాడు.
అవసాన కాలంలో తన కొడుకు పెదతిరుమలయ్యను పిలచి ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునికి వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడు. 95 సంవత్సరములు పరిపూర్ణజీవితం గడపి దుంధుబి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశినాడు ఫిబ్రవరి 23, 1503న పరమ పదించారు. రాగిరేకులమీద వ్రాసిన కారణంగా అన్నమయ్య జనన మరణాలు తెలుస్తున్నాయి.
మొత్తం మీద 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. కాని ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నాయి. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.