header

Bhakta Ramadas, Kancherla Gopanna

కంచెర్ల గోపన్న - రామభక్తుడు
కంచెర్ల గోపన్న రామభక్తునిగా మారిన తరువాత భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందాడు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1620 సంవత్సరంలో జన్మించాడు. తండ్రి లింగమూర్తి. తల్లి కామాంబ. దాశరధీశతకంతో సహా ఎన్నో రామకీర్తనలు రామదాసు అందించినవే. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు రామదాసు అంటారు.
ఇతని గురువు రఘునాథభట్టాచార్యులు. గోపన్న మేనమామ మాదన్న గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో ఒక ముఖ్యఉద్యోగి. ఇతని సిఫార్స్ వలన గోపన్న పాల్వంచ పరగణాకు తహసిల్దార్ గా నియమించబడ్డాడు. గోదావరి నదీతీరంలోని భధ్రాచలంకూడా ఈ పరగణాలోనిదే. అప్పటికి భద్రాచల రామాలయం పాడుపడిన స్థితిలో ఉంటుంది. పోకల దమ్మక్క అనే రామభక్తురాలు ఈ గుడిని పునరుద్దరించమని గోపన్నను కోరతుంది. గోపన్న దానికి అంగీకరిస్తాడు. ఆలయ నిర్మాణానికి తానీషాకు కట్టవలసి భూమిశిస్తు సొమ్మును వాడతాడు. ఈ విషయం తెలిసిన తానీషా ఆగ్రహంతో గోపన్నను ఖైదు చేస్తాడు. 12 సంవత్సరాలు జైలులో బాధలు పడతాడు గొపన్న. జైలుగది గోడల మీద సీతా రామలక్ష్మణులను చిత్రాలను గీసి వారిని గురించి గానం చేస్తూ కాలం గడుపుతాడు. ఈ సమయంలోనే ప్రసిద్ధ సంకీర్తనలు రచించాడు. వాటిలో కొన్ని
"నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి"
"పలుకే బంగారమాయెనా"
"అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి.
ఇంకా తన బాధను చెప్పుకున్న
"ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది-
"నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి
మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు.
12 సంవత్సరాలు తరువాత, రామలక్ష్మణులు గోల్కొండ నవాబు తానీషా వద్దకు వెళ్ళి, గోపన్న బాకీపడ్డ ఆరు లక్షల వరహాల శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసును విడిపించటానికై పత్రము వ్రాయించుకున్నారని కథనం. వారిచ్చిన నాణెములను రామటంకాలు అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్రలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై కొంత భూమిని ఇచ్చారు.
ఇప్పటికి కూడా రామదాసుని ఖైదులో ఉంచిన గదిని గోల్కొండ కోటలో చూడవచ్చు.
శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పటి నుండి ప్రారంభమైంది తరువాత నుండి కంచర్ల గొపన్న భక్తరామదాసుగా పేరుపొందాడు. రామదాసు సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ భద్రాచల దేవస్థానములో భద్రపరచి ఉన్నాయి.
శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు.