header

Kavi Kshetraiah

కవి క్షేత్రయ్య
క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఇంటిపేరు మొవ్వ. ఇతని జన్మస్థలం కృష్ణాజిల్లాలోని మొవ్వగ్రామం. ఈ ఊరిలో వెలసిన వేణుగోపాలస్వామి ఇతని ఇష్టదైవం కర్నాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య ఒకడు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ ఉండటం వలన ఇతనికి క్షేత్రజ్ఞుడు అనే పేరు వచ్చినది అది క్షేత్రయ్యగా మారింది.
జనంలో ఉన్న కథనం:
క్షేత్రయ్యకు చిన్నతనం నుండి గాన అభినయాలంటే ఇష్టం. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకున్నాడు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసీతో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు రుక్మిణితో వివాహం జరుగుతుంది. కానీ మోహనాంగి మీద అతనికున్న మక్కువ తగ్గలేదు. మోహనాంగి చాలా వివేకంగల పండితురాలు. తమ ఆరాధ్యదైవమైన మువ్వవేణుగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పిస్తే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని షరతు విధించినదని అంటారు. మోహనాంగి పెట్టిన షరతుకోసం వరదయ్య నిరంతరం సాధనచేస్తాడు. తరువాత ప్రపంచంలోని జీవాత్మలన్నీ స్త్రీలని పరమాత్ముడైన మువ్వగోపాలుడు ఒక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదని అంటారు. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. మోహనాంగి నాట్యం చేసేదని అంటారు.
వరదయ్య అనేక క్షేత్రాలను దర్శిస్తాడు. ముందుగా గుంటూరు జిల్లాలోని బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శిస్తాడు. (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపింపలేదా?). అనంతరం భ్రదాచలంలోని సీతారామచంద్రస్వామిని, తరువాత శ్రీశైలంలోని మల్లిఖార్జునస్వామిని, హంపి హేమాద్రినిలయుని దర్శంచారు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరి ఇనపురి స్వామి, దేవుని కడప శ్రీవేంకటేశ్వరస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి. ఇంకా క్షేత్రయ్యఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు. చిదంరం గోవిందస్వామిని తిల్ల గోవిందస్వామి అని కీర్తించాడు.
చిదంబరం పాలకుడైన కృష్ణప్ప నాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు రఘునాథనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. కంచి, రామేశ్వరం, శ్రీరంగం క్షేత్రాలను దర్శించాడు.1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైనది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని క్షేత్రయ్యను సగౌరవంగా గొల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళతాడు. ఆ నవాబు ఆస్ధానంలో క్షేత్రయ్య చాలాకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం తహసిల్దారు కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగి వచ్చాడు.
క్షేత్రయ్య 4,500 పదాలకు పైగా రచించాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి. ఆయన పదకవితలు నేటికి సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నుముకగా నిలచిఉన్నాయి.