మొల్ల జీవితకాలం క్రీ.శకం 1440 నుండి 1530 మధ్యకాలం. ఈమె గొప్ప రామభక్తురాలు. తెలుగులో మొల్లరామాయణంగా ప్రసిద్ధి చెందిన ద్విపదకావ్యమును వ్రాసినది మొల్ల. మొల్ల కవితా శైలి సరళమైనది మరియు రమణీయమైనదని ప్రపసిద్ధి. ఈ కావ్యాన్ని కేవలం ఐదు రోజులలో వ్రాసింది అంటారు. ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషలో ఈ కావ్యం వ్రాయబడింది.
ఈమె కడప జిల్లా గోపవరం ప్రాంతానికి చెందినది. ఈమె తండ్రి కేశవ. కుమ్మరి కులానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవటంతో తండ్రి ఈమెను గారాబంగా పెంచాడు. చివరిదాకా ఈమె తన తండ్రి పేరునే ఇంటిపేరుగా తెలియజేయటం వలన ఈమె అవివాహితగా భావించబడుతుంది.
మొల్ల ఏ విధమైన సాంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తనలో ఉన్న సహజపాండిత్యమునకు భగవంతుడే కారణమని మొల్ల చెప్పటం విశేషం. ఆ రోజులలో మిగతా కవుల వలే ధనార్జనకు తన కావ్యాన్ని ఏ రాజునకు అంకితమివ్వలేదు. కీర్తిని ధనాన్పి ఆశించక తన కావ్వాన్ని భగవంతునికి అర్పించినది. ఈమె గొప్ప భక్తురాలు.
మొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదిగా చెప్పబడుతుంది. గోపవరంలో జనం తరతరాలుగా మొల్లబండగా భావించే బండ ఉంది. జనం ఈ బండకు పూజలు చేస్తుంటారు.