header

Goswamy Tulasidas / గోస్వామి తులసీదాసు

Goswamy Tulasidas / గోస్వామి తులసీదాసు
గోస్వామి తులసీదాసు రామభక్తుడు మరియు గొప్ప కవి . అతను 1532 సం.లో ఉత్తరప్రదేశ్ లోని బండా జిల్లాలో రాజపూర్ అనే గ్రామంలో జన్మించాడు .తల్లి దండ్రులు ఆత్మారాము దుబె హుల్సీదేవి
తులసీదాసు జన్మించిన కొన్ని మాసాల తరువాత తన తల్లిని కోల్పోయాడు. అచిరకాలంలో తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. అతని పోషణ బాధ్యత వృద్ధురాలైన నాయనమ్మ స్వీకరించింది. బాలుడుగా అతడు రామబోలా లేక రమోలా అని పిలువబడేవాడు. అతడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ పాండిత్యంలోని వివిధ శాఖలలో ప్రావీణ్యం సంపాదించాడు. దీనబంధు వధకుని పుత్రిక రత్నావళిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు తారావతి అనే కుమారుడు జన్మించాడు. కానీ ఆ పుత్రుడు బాల్యంలోనే మరణించాడు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తరువాత రత్నావళి రక్షాబంధనం కోరకు బదరిలోని తన సోదరుల ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.
తులసీదాసు కూడా తొమ్మిది రోజుల పాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తీవ్రమైన ఒంటరి తనానికి గురవుతాడు. భర్యదగ్గరకు బయలుదేరి, సాహసంతో వరదల్లో ఉన్న గంగానదిని ఈది అర్ధరాత్రికి తన మామగారి ఇల్లు చేరుకున్నాడు. అటువంటి అసాధారణ సమయంలో భర్తను కలుసు కున్నందుకు ఆశ్చర్యపోయిన రత్నావళి తన భర్తను వరద నీటిని దాటి ఏ విధంగా రాగలిగారని ప్రశ్నించింది.
రత్నావళీ తన మీద ఉన్న ప్రేమతో ఇలా చేశాడని గ్రహించి ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. కానీ ఈ ప్రయత్నం భగవంతుని మీదకు మళ్ళించినట్లయితే భగవంతుని దర్శనభాగ్యం తప్పక కలుగుతుంది." అంది. ఈ మాటలు విన్న తులసీదాసు జీవితం ఒక ఆకస్మికమైన మలుపు తిరుగుతుంది. వైవాహిక సంబంధమైన ప్రేమ, భగవంతుని వైపు మరలుతుంది అతడు వెంటనే బదరీనీ, సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు.
తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఎంత వెదకినా అతని జాడ దొరకలేదు. ప్రేమ విశ్వాసాలు గల తులసీదాసు భార్య దిక్కులేనిది అయిన రత్నావళి అన్ని సుఖాలను విసర్జించి చివరి వరకు ఒక వైరాగ్య జీవితాన్ని గడిపింది. బదరి నుండి తులసీదాసు విస్తృతంగా పర్యటించాడు. తులసీదాసు దేశ దిమ్మరిగా ఒక సంగీత పాటకునిగా కొంతకాలం పాటు, అయోధ్యలోనివసించాడు. తరువాత కాలంలో మొత్తం 12 పుస్తకాలు కూడా వ్రాశాడు .
హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకడు ఈయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీ భాషలో ‘‘రామచరితమానస్’’ అనే పేరుతో రచించిన తొలి కవి. ఈ గ్రంథరచన రామజన్మభూమి అమోధ్యలో మొదలు పెట్టి వారణాసిలో పూర్తి చేశాడు. ఈయన పేరుమీద వారణాసిలో తులసీఘాట్ కూడా ఉంది. రామ భక్తుడయిన ఆంజనేయునిపై హనుమాన్‌ చాలీసాను కూడా వ్రాసాడు.
ఈయన సంస్కృతంతో పాటు హిందీలో కూడా అనేక రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచన వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.తులసీదాసు హనుమంతుని సహాయంతో శ్రీరామ దర్శనం పొందాడంటారు. ఈ కృత తో వారణాసిలో ‘‘సంకటవిమోచన్’’ అనే దేవాలయాన్ని కట్టించాడు.