వేములవాడ భీమకవి
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంనకు 4 క్రోసుల దూరంలో వేములవాడ గ్రామంలో సోమనాథ మాత్యుడు , మాచమ్మ ఆనే దంపతులకు క్రీ శ 1068 ప్రభావ నామ సంవత్సరము శ్రవణ శుద్ధ శ్రుక్రవారం నాడు జన్మించిన స్వామి తాను కవిగా చాల ప్రాముఖ్యత ను సంపాదించారు వేదాలకు మూలమైనటువంటి పరమేశ్వరుని అంశతో జన్మించినవారు, అఖిలలోకపాలకసుశక్తి సంపన్నులు “శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి”. నిత్యబ్రహ్మచారిగా ఈయన, తన జీవితం తొలిదశలో, కవీశ్వరునిగా ప్రాశస్త్యం గడించారు. మలిదశలో దైవాంశసంభూతులుగా భక్తకోటి ఆరాధ్యదైవంగా నిలిచారు.
పదహారేళ్ళప్రాయంలో మొదలైన ప్రస్థానం, కవిగా మానవజీవిత విశేషణాన్ని, మానవజన్మ ఆవశ్యకతను, జీవి పరమార్థాన్ని, జనులకు తన తత్వబోధనలు, పద్యపద్మాల ద్వారా ఈ విశ్వానికి సత్యమార్గాన్ని నిర్దేశించిన కవిబ్రహ్మ శ్రీ వేములవాడ భీమకవి.
ద్రాక్షారామ భీమేశ్వరుడి వరప్రసాదంగా శాపవిమోచన శక్తిని కలిగిన, తన పదవాక్కుతోటి అక్షరాలను రెక్కలుగా మార్చి, విశ్వవిహారం చేసిన కవియోగి శ్రీ వేములవాడ భీమకవి.
వాగ్బాణము, వాక్చాతుర్యము కలిగిన, తన అమోఘవాక్కులతో పాదాశ్రితులకు, ఆరాధకులకు ఆశీర్వచనాలను, వరాలను గుప్పించే నిత్యశుభకరుడు, అఖిలైశ్వర్యప్రదాయకుడు శ్రీ వేములవాడ భీమకవి.
కవిగా ఉద్దండకవితావాగ్ధురీణుడై, ఎందరో ప్రభువులను, రాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేస్తూ, వారికి కొండంత అండగా నిలిచి, నిరంతర సత్యాన్వేషణ విచక్షణుడై, పరిపాలనాదక్షతలో వారికి మార్గోపదేశం చేసిన రాజగురువు, పరిపాలక ప్రవీణదర్శుడు శ్రీ వేములవాడ భీమకవి.
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్ గ్రామం లో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో చరిత్ర గాంచినది .