వేంగమాంబ క్రీ.శ. 1800 ప్రాంతంలో చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలంలో తరిగొండ గ్రామంలో జన్మించింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి ఈమె గొప్ప భక్తురాలు. తల్లిదండ్రులు వాసిష్ట గోత్రికులైన కృష్ణయ్య, మంగనాంబలు. వెంగమాంబకు బాల్యంనుండి భక్తి అలవడినది. చిన్న వయసులోనే అనేక భక్తిపాటలను కూర్చి మధురముగా పాడేది. తండ్రి ఈమెలోని నైపుణ్యమును గమనించి తనకు తెలిసిన శుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకై పంపారు. దీక్షితులు కూడా వెంగమాంబలోని నైపుణ్యమును గమనించి తనకు తెలిసిన విద్యనంతా వెంగమాంబకు బొధించారు.
కొద్దికాలంలోనే వెంగమాంబ గురించి నలుమూలలకు పాకటంతో తండ్రి ఆమెను విద్యాభ్యాసం మాన్పించి తగిన వరునికోసం వెతుకులాట ప్రరంభించారు.
అనేకమంది వరులు ఆమెను చూసి ఆమె చాలా అందంగా ఉన్నదనో లేక చాలా తెలివైనదనో నెపంతో పెళ్ళిచేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటప్ప ఆమె అందమునకు ముచ్చటపడి వివాహము చేసుకొనుటకు అంగీకరించాడు. వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసి విఫలుడయ్యాడు. వెంగమాంబ అతనిని దగ్గరకు రానివ్వలేదు. తరువాత భర్త చనిపోవడంతో ఆమె బాలవితంతువు అయ్యింది.
తరువాత ఈమె తిరుమలకు చేరి ఆలయానికి ఉత్తరాన దట్టమైన అడవులలో తుంబురకోనవద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు శ్రీవేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉండేవాడని అంటారు. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తనింటి ముంగిటకు వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండిపళ్ళంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఈ విషయం క్రీస్తుశకం 1890లో తూర్పు ఇండియా కంపెనీ వారు తయారుచేసిన కైంకర్య పట్టీవలన తెలుస్తుంది. తిరుమలకు ఉత్తరదిశలో ఉన్నవనంలో (ప్రస్తుతం ఇక్కడ పాఠశాల ఉంది) వెంగమాంబ సమాధిని మనం ఇప్పటికీ చూడవచ్చు.
వెంగమాంబ రచనలు వేదాంతము మరియు భక్తిప్రధానమైనవి. ఈమె రచనలలో ముఖ్యమైనవి
వేంకటాచల మహత్యము, అష్టాంగ యోగసారము
ద్విపద భాగవతం (ద్వాదశ స్కంధము) రమాపరిణయం, రాజయోగామృతసారము, వాశిష్టరామాయణం, శతకాలు, శ్రీకృష్ణమంజరి, తరిగొండ నృసింహశతకము, యక్షగానాలు, నృసింహ విలాసము, శివలీలా విలాసము, బాలకృష్ణ నాటకము, విష్ణుపారిజాతం, రుక్మిణీ నాటకము, గోపీనాటకము, ముక్తికాంతా విలాసము, జలక్రీడా విలసము, తత్వకీర్తనలు మొదలగునవి.