header

స్వామి వివేకానంద / Swamy Vivekananda

స్వామి వివేకానంద (1863-1902)
చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో భారతదేశ విశిష్టతను విశ్వవ్యాప్తం గావించిన మేధావి స్వామి వివేకానంద.
1863 సంవత్సరంలో కలకత్తాలో జన్మించిన నరేంద్ర దత్త చాలా చురుకైన వాడు. బాల్యంలోనే ఏదీ సులభంగా నమ్మేవాడు కాదు. ఆచారాల వెనుక అర్ధం అవగతం కానిదే ఆచరించేవాడు కాదు. అతనిలోని ఈ లక్షణమే చివరకు భగవంతుని అస్తత్యాన్ని ప్రశ్నించగలిగింది. అలా భగవంతుని దర్శించిన మనిషికోసం అతని యాత్ర ప్రారంభమైంది.
తన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చిన రామకృష్ణ పరమహంస పరిచయంతో ఇతని జీవితం మారిపోయింది. రామకృష్ణ పరమహంస మరణం తరువాత సన్యాసం స్వీకరించి వివేకానందునిగా పేరుపొందాడు.
చికాగో నగరంలో జరిగిన ప్రపపంచ మత మహాసభలో అమెరికా వచ్చిన అనామకుడైన వివేకానందుడు తన తొలి ఉపన్యాసంలో అమెరికా సోదర సోదరీమణులారా అన్న పలుకులతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. నాలుగు సంవత్సరాల తరువాత భారతదేశం తిరిగి వచ్చిన స్వామి భారతజాతి సముద్ధరణకు పూనుకున్నాడు. ఇతని ఆశలన్నీ యువతరం మీదనే ఉండేవి. ఒకసారి కొందరు విదేశీయులు మీకు గురుదక్షిణ ఏమికావాలి అంటే నా దేశాన్ని ప్రేమించండి అంటాడు.
స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం నేటికీ ప్రపంచ వ్యాప్తంగా తన అమూల్య సేవలను అందిస్తూనే ఉంది. ఆధ్యాత్మిక రంగంలోనూ, భారతీయ విలువల ప్రచారం, వ్యక్తి నిర్మాణంలోనూ గత వందేళ్లుగా, నిరంతరంగా స్వదేశీయులను, విదేశీయులనూ ఆకర్షిస్తూ ముందుకు పోతూ ఉంది. వివేకానందుని స్ఫూర్తి ఆనాటి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అనేకమందిపై ఉండేది. గాంధీ, బోస్, అరబిందో, నెహ్రూ వంటివారు, గురు గోల్వాల్కర్, జంషెడ్జీ టాటా, రాక్ఫెల్లర్, ఫోర్డు వంటివారు వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ముందంజ వేసారు.