header

Dr. B.R.Ambedkar….డా. బి.ఆర్ అంబేద్కర్

Dr. B.R.Ambedkar….డా. బి.ఆర్ అంబేద్కర్
భారత రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు. దళితుల అభివృద్ధికి కృషి చేసారు.1947వ సం.నుండి 1951 వరకు కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖా మంత్రిగా పనిచేసారు.
ఇతని పూర్తిపేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. మధ్యప్రదేశ్ లోని మహోంలో 1891 ఏప్రియల్ 14వ తేదీన జన్మించారు. బీదకుటుంబంలో జన్మించారు. కానీ తన స్వయంకృషి, ప్రతిభతో ఎదిగి కేంద్రమంత్రి పదవి సాధించారు. వీరు మొహర్ కులస్తులు. వీరిని ఆకాలంలో అంటరానివారుగా చూసేవారు. ఈ కారణంతోనే అంబేద్కర్ చిన్నతనంలోనే కులపరంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు.
బరోడా మహారాజు ఇచ్చిన 25 రూ. విద్యార్ధి వేతనంలో బి.యే పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేసే ఒప్పందంపై ఉన్నతచదవులకు సాయంపొంది కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ ఎం.ఏ. పి.హెచ్.డి డిగ్రీలను సాధించాడు. విద్యాభ్యాసం పూర్తైన తరువాత బరోడా మహారాజు ఆస్థానంలో మిలటరీ కార్యదర్శిగా చేరాడు. కానీ ఇంతటి విద్యావంతుని కూడా ఆఫిసు జవానులు సైతం అంటరానివాడిగా చూసేవారు .ఆనాటి నుండి అంటరానితనం నిర్మూలనకు తన వంతు కృషిని ఆరంభించాడు. మనుస్మృతిని బహిరంగంగా కాల్చాడు. రాజ్యాంగ సభ సభ్యడిగా ఎన్నుకోబడి, రాజ్యంగ రాజ్యాంగం రచించటానికి పూనుకొన్నాడు. అత్యంత శ్రమకు ఓర్చి రాజ్యాంగ రచనను పూర్తిచేసారు.
1947లో న్యాయశాఖా మంత్రిగా నియమించబడి 1951 అక్టోబర్ లో తన మంత్రిపదవికి రాజీనామా చేసారు.
ఇతని మొదటి భార్య 1935 చనిపోయింది. తన 56వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లిచేసుకున్నాడు. 1956 అక్టోబర్ 14వ తేదీన అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు.
సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ అనేక గ్రంధాలు వ్రాసారు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవెన్షియల్ డి సెంట్రలటైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రటీష్ ఇండియా’, ‘ ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్దా అండ్ హిజ్ ధర్మా’ అనేవి ముఖ్యమైన రచనలు.
అంబేద్కర్ మహా మేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త.
ఈ మహానీయుడు 1956 డిసెంబర్ 6వ తేదీన కీర్తిశేషులయ్యారు. భారతప్రభుత్వం ఈ మహానీయుణ్ణి ‘భారతరత్న’ బిరుదుతో (మరణానంతరం) గౌరవించింది.