భారతీయ అణుపరిశోధనా రంగ రూపశిల్పి హోమీ జహంగీర్ బాబా. 1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి, 1945 సంవత్సరంలో “ TATA Institute of fundamental research” ను స్థపించారు. వీరు 1937లోనే ‘‘కాస్మిక్ రేడియేషన్’’ పై పరిశోధనలు జరిపి ‘‘మిసాన్’’ అనే కణాలను కనుగొన్నారు. దీనితో వీరు విశ్వవిఖ్యాతి గాంచారు.
1948లో ఆటమిక్ కమీషన్ కు అధ్యక్షునిగా ఎన్నికై భారతీయ అణుశక్తి నిర్మాణానికి రూపు దిద్దాడు. ఇది వారి దూరదృష్టికి చక్కని తార్కారణం. దీని వలన భారతదేశం ఇతరుల మీద ఆధారపడకనే స్వంతంగా అణుశక్తి రంగంలో స్వావలంబన సాధించింది.
1963 సంవత్సరంలో తారాపూర్ లో తన మొదటి అణురియాక్టర్ ను భారతదేశం నిర్మించింది. ఇది బాబా చలవే. మరో రెండు సంవత్సరాల కాలంలోనే ప్లూటోనియం ప్లాంట్ నిర్మించి ప్రపంచాన్ని ఆశ్ఛర్యపరచారు.
1966వ సంవత్సరంలో ఒక విమాన ప్రమాదంలో బాబా మరణించటం భారతజాతికి ఒక తీరని శాపంగానే చెప్పవచ్చు. కానీ ఆయన మరణానంతరం ప్రపంచం భావించినట్లుగా భారతీయ అణుకార్యక్రమం కుంటుపడలేదు. బాబా రూపకల్పన చేసినట్లుగానే 1974 సంవత్సరంలో పొక్రాన్ మొదట అణుశాస్త్ర ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. దీనితో ప్రపంచంలో అణుప్రయోగం చేసిన ఆరవ దేశంగా భారతదేశం అవతరించింది.
నేడు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే అణురియాక్టర్ లలో ‘‘ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ’’ ని దూరదృష్టితో ఆనాడే బాబా రూపకప్పన చేశాడు. అణురియాక్టర్లలను మూడు దశలలో వనియోగించుకునే విధానం రూపుదిద్దింది కూడా బాబానే.
అణు కార్యక్రమాలకు కావలసిన యూరేనియమ్ అనే ఇంధనం భారతదేంలో అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఆనాడే బాబా రూపకల్పన చేశాడు.
నేడు భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం హోమీ బాబా స్ఫూర్తి అని ఆయనతో కలిసి పనిచేసిన మన మాజీరాష్ట్రపతి కలాం గారి అభిప్రాయం.