భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వీరు తెలుగువారు. వీరి పూర్వులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ,., పూణే సైన్స్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులయ్యారు.
బొంబాయి ప్రజాపనుల శాఖలో చేరి ఆ తరువాత, విశ్వేశ్వరయ్య భారత నీటి పారుదల కమీషన్ లో చేరారు. ఈయన దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఆనకట్టలలో ఏర్పరచటానికి ఆటోమేటిక్ వరద గేట్లను ఈయన రూపకల్పన చేశారు. వీటిని 1903లో మొదటిసారిగా పూణే సమీపంలోని ఖడక్ వాస్లా వద్ద ఏర్పరచారు. ఆ తరువాత ఇటువంటి గేట్లనే గ్వాలియర్, మైసూర్ వద్ద గల కృష్ణరాజసాగర్ ఆనకట్టలలో కూడా నిర్మించారు.
హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించే నీటిపారుదల వ్యవస్థను నిర్మించటంతో ఆయనకు గొప్ప పేరు ప్రతిష్టలు లభించాయి. విశాఖపట్నంలోని ఒడరేవు నిర్మాణంలో కూడా ఈయన పాత్ర ఉంది.
1908 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత ఈయన మైసూర్ సంస్థానంలో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపనలో వీరు ప్రముఖపాత్ర వహించారు.
బ్రిటీష్ ప్రభుత్వం వీరికి సర్ బిరుదును ప్రధానం చేసింది. భారత ప్రభుత్వం 1955లో ‘‘భారతరత్న’’తో సత్కరించింది.