జ్యోతిష శాస్త్రంలో వరాహమిహిరుని ప్రజ్ఞను తెలుసుకున్న మాళ్వ వంశస్థుడైన రాజా యశోధర్మ విక్రమాదిత్యుడు వరాహమిహురుని తన ఆస్థాన పండితునిగా నియమించి గౌరవించాడు. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పటికీ, వైజ్ఞానిక దృక్పథం గల వరాహమిహిరుడు పాతకాలపు విశ్వాసాలను గుడ్డిగా విశ్వసించలేదు. ఆర్యభట్టులాగే ‘భూమి గుండ్రంగా ఉంటుంద’ని చెప్పాడు.
భూమ్యాకర్షణ శక్తి గురించి మొట్టమొదట చెప్పినది వరాహమిహిరుడే! మానవ శరీరాలను ఒక బలమైన శక్తి భూమిపై లాగి నిలిపి ఉంచుతోందని తెలిపాడు. చంద్రుడు, ఇతర గ్రహాలు కూడా స్వయం ప్రకాశాలు కావనీ, సూర్యకాంతి వల్లనే అవి ప్రకాశిస్తున్నాయని అన్నాడు. వరాహమిహిరుడు రచించిన గ్రంధాలలో ‘పంచ సిద్ధాంతిక’ ప్రముఖమైనది. ఇందులో ఆయన ప్రాచీన వాజ్మయంలో చెప్పబడిన ఐదు ప్రధాన ఖగోళ సిద్ధాంతాలను విశ్లేషించారు. ఖగోళశాస్తప్రరమైన గణిత సంబంధిత విషయాలు ఇందులో వివరించబడ్డాయి. సూర్యసిద్ధాంతం, రోమక సిద్ధాంతం, పౌలిస సిద్ధాంతం, వశిష్ట సిద్ధాంతం, పైతమ సిద్ధాంతాలను ఈ గ్రంధంలో చర్చించారు. ఆయన మరో గ్రంధం ‘బృహద్ సంహిత’. ఇందులో జ్యోతిషం, గ్రహాల కదలికలు, గ్రహణములు, మేఘాలు కమ్ముకోవడం, వర్షాలు పడడం, కుటుంబ సంబంధాలు, రత్నాలు, మణులు, ముత్యాలు, వివిధ కర్మకాండలు మొదలైనవాటి గురించి వివరాలున్నాయి.
తోకచుక్కల గురించి కూడా విశేషమైన చర్చ చేశాడు. ఆ రోజుల్లో టెలిస్కోప్ వంటి పరికరాలే లేవు. వాటి గురించి ఆయన 60 శ్లోకాలలో వివరాలు చెప్పాడు. గర్గుడు, పరాశరుడు, అసితుడు, దేవలుడు వంటి మహర్షులు అంతకుముందే తోకచుక్కల గురించి ఎన్నో విశేషాలు చెప్పారని ఉటంకించాడు.
జ్యోతిష శాస్త్రంలోని మూడు ప్రధాన విభాగాలకు ఎన్నో విషయాలు గ్రంధస్తం చేశాడు. ఆయన కుమారుడు ప్రీతుయశస్ జ్యోతిషశాస్త్రంపై ‘హోరశాస్త్ర’ గ్రంధాన్ని రచించాడు.
గణిత శాస్త్రానికి సంబంధించిన త్రికోణమితి సూత్రాలను వరాహమిహిరుడు కనుగొన్నాడు. ఆ సూత్రాలకు లెక్కలు కట్టి పట్టికలు తయారుచేశాడు. సున్నా, ఋణాత్మక సంఖ్యలకు సంబంధించిన బీజ గణిత లక్షణాలను ఆయన నిర్వచించాడు. నేడు మనం ప్రముఖంగా వింటున్న ‘పాస్కల్ ట్రాంగిల్’ని మొదట రూపొందించింది వరాహమిహిరుడే. ద్విపద గుణకాన్ని (బినోమియల్ కోఎఫిషియంట్స్) ఎలా గణించాలో కూడా వివరించాడు. పర్యావరణం, భూగర్భ జలాల గురించి కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. భూగర్భ జలాలను ఎలా కనిపెట్టాలో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వరాహమిహిరుడే.
చెదలు ఎక్కువగా ఉన్న చోట భూమిలోపల జలాలున్నాయనడానికి సంకేతమని ఆయన చెప్పిన విషయంపై నేటి శాస్తవ్రేత్తలు దృష్టిపెడుతున్నారు. ఎటువంటి సాంకేతిక పరికరాలూ లేని ఆరోజుల్లోనే- ఏడాదిలో రాత్రి, పగలు సమానంగా ఉండే రోజుల గురించి చెప్పాడు. దీనికి సంబంధించి వరాహమిహిరుడు చెప్పిన ‘విలువ’ను నేటి జియోస్టేషనరీ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు.
‘పంచ సిద్ధాంతిక’ గ్రంధంలో సూర్య సిద్ధాంతం ఒకటి. ఇందులో కాంతి గమనం గురించి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురువు, శని వంటి గ్రహాల ‘వ్యాసాల’ గురించిన వివరాలున్నాయి. గ్రహాలు ఒక ప్రక్కకి ఒరిగి తూర్పు వైపుగా ఎలా తిరుగుతాయో వర్ణన ఉంది.
ఇదే గ్రంధంలో వివిధ నక్షత్రాల స్థానాలూ, సూర్యగ్రహణాలకి సంబంధించిన లెక్కలు ఉన్నాయి.
ఈ అద్భుతమైన గ్రంథంలో అంగారక గ్రహం గురించి చాలా విశేషాలున్నాయి. అంగారక గ్రహం వ్యాసం, చుట్టుకొలత, దాని రంగు, దాని చుట్టూ తిరిగే ఉపగ్రహాల వివరాలున్నాయి. అంగారక గ్రహంపై నీరు, ఇనుప ఖనిజాలు లభ్యవౌతున్నాయని వరాహమిహిరుడు పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని నాసా, ఇస్రో పరిశోధనలు కూడా చెప్తున్నాయి.
సౌరమండలంలోని గ్రహాలు ఎలా ఆవిర్భవించాయో, సూర్యుని కేంద్రంగా చేసుకుని అవి ఎలా పరిభ్రమిస్తున్నాయో మొట్టమొదట వివరించింది వరాహమిహిరుడే!