header

Bandaru Atchamamba, Acchamamba

అచ్చమాంబ
bandaru accamamba అచ్చమాంబ తొలి తెలుగు కథారచయిత్రి. 1874వ సంవత్సరంలో కృష్ణాజిల్లా నందిగామకు దగ్గరలోని పెనుగంచిప్రోలులో జన్మించింది. ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో కూడా ప్రవేశం ఉన్నది.
1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఈమె తీరని లోటు. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఐదారుగురు పిల్లలు చదువుకుంటూ వుండేవారు.
వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంధాన్ని రచించింది. ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.
అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది.
1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది