మహాసామ్రాజ్య నేత, మహా బలవంతుడు అక్బర్ ను ఎదిరించి నిలచిన ధీరవనిత బీజపూర్ రాణి చాంద్ బీబీ. చాంద్ బీబి తండ్రి బహమని రాజ్య స్థాపకుడు. చాంద్ బీబీ ఈమె 1550 సంలో అహ్మద్ నగర్ లో సుట్టింది. స్వతహాగా అందగత్తె, ధైర్యవంతురాలు చిన్న తనంలోనే యుద్ధవిద్యలలో శిక్షణ పొంది రాటుతేలింది. ఈమె బహు భాషలు నేర్చిన రాణి. చిత్రాలను వేయటంలో నేర్పరి. సీతార వాయిద్య కళాకారిణి. బీజపూర్ సుల్తాన్ ఆదిల్షాతో ఈమె వివాహం జరిగింది. కానీ శత్రువుల కుట్ర ఫలితంగా ఇతను హత్య చేయబడ్డాడు.
అప్పటికి వీరికి సంతానం లేదు. చాందబీబి పరిపాలన చేపట్టి తన మరిది కొడుకును సింహాసనంమీద కూర్చుండబెట్టింది. మంత్రి కెమాల్ ఖాన్ తిరుగుబాటు చేసాడు. మరో మంత్రి సహాయంతో కెమాల్ ఖాన్ ను మట్టుబెట్టింది. తన మరిది కూతురును అహ్మద్ నగర రాజు మీరన్ హుస్సేన్ కు ఇచ్చి వివాహం చేసింది. కానీ దురదృష్ణ వశాత్తు మీరన్ హుస్సేన్ పరలోకగతుడయ్యాడు. మాలికా అంబర్ అనే వ్యక్తిని అహ్మద్ నగరానికి మంత్రిగా నియమించి అహ్మద్ నగర పాలన కూడా చేపట్టింది.
బీజపూర్ ను అహ్మద్ నగర్ ను సమర్థవంతంగా పాలించసాగింది. కానీ అప్పటి నుండి ఈమె జీవితమంతా కుట్రల మయమే. కానీ తన తెలివితేటలతో, నేర్పరితనంతో నెట్టుకొచ్చింది. కానీ అధికారం కోసం సొంతవారే శత్రువులయ్యారు. అస్థానంలోని మియర్ మంజు అక్బర్ సహాయంతో అధికారాన్ని దక్కించుకోవాలని అక్బర్ పక్కన చేరాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని తన కొడుకు మురాద్ నాయకత్వంలో మొగల్ సేనలను అహ్మద్ నగర్ మీదకు పంపాడు. 1595చివరిలో జరిగిన ఈ దాడిలో చాంద్ బీబీ నాయకత్వంలోని సైన్యం మొగలాయి సైన్యాన్ని తిప్పికొట్టింది కానీ మొగలాయిలు వెనక్కి తగ్గలేదు.మహమ్మద్ ఖాన్ అనేమంత్రి మొగలాయిల పక్కన చేరాడు. బీజపూర్, గోల్కొండ రాజులు చాంద్ బీబికి సహాయం అందించారు. అక్బర్ కొడుకు మురాద్ యుద్ధంలో మరణించాడు. అహ్మద్ నగర్ కోట మొగలాయిల వశం కాలేదు.
దీనితో అక్బర్ 1597లో తన మరో కొడుకు దనియాల్ నాయకత్వంలో మొగల్ సేనలు అహ్మద్ నగర్ మీద దాడికి పంపాడు. తను కూడా స్వయంగా దండయాత్రకు బయలు దేరాడు. అక్బర్ సేనలు వచ్చేలోగా చాంద్ బీబి కోట గోడలను పటిష్టం చేసింది, కోటలోపల మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంది. అక్బర్ సేనలు ఫిరంగులు ఉపయోగించిన కోటగోడలు చెక్కుచెదరలేదు. చాంద్ బీబీ స్వయంగా కత్తి చేతబట్టి సైనికులను ఉత్సాహపరిచింది,
యుద్ధం భీకరంగా మారటంతో చాంద్ బీబి కోట తలుపులు తెరిపించి కత్తి పట్టుకుని భయంకరంగా శత్రువుల మీద విరుచుకుపడింది. ఇరువైపులా భారీ సంఖ్యలో సైనిక నష్టం జరిగింది. అక్బర్, చాందబీబీ కూడా యుద్ధం విరమించటం మంచిదని నిర్ణయానికి వచ్చారు. కానీ ఆ రాత్రి స్వంత వారే నిదిరిస్తున్న చాంద్ బీబి గొంతు నరికి చంపి పారిపోయారు. అహ్మద్ నగర్, బీజాపూర్ లు రెండూ అక్బర్ వశమయ్యాయి. అక్బర్ చాంద్ బీబీకి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు.