చందాకొచ్చర్ భారతదేశంలోని రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన ఐ సి ఐ సి యస్ కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో 1961 లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత ముంబై జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982లో అకౌంటెన్సీని పూర్తి చేశారు. తర్వాత జమునాలాల్ బజాజ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
1984 లో ఐ సి ఐ సి యస్ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ చేరిన ప్రధమంలో సంస్థ యొక్క జౌళి, కాగితము మరియు సిమెంటు విభాగాలలో పనిచేసింది. 1993 లో, కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. 1996 లో శక్తి టెలికాం మరియు రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
ఈవిడ ముంబైలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు పవనశక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి.
2005 నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. 2009 లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
2010 లో ఈమెను భారతప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సన్మానించింది.