header

Durgavathi devi

దుర్గావతి దేవి/దుర్గావతి భాబి
Durgavathi devi భారతదేశ చరిత్రలో కొంతమంది విప్లవవీరుల ప్రస్తావన లేకపోవటం దురదృష్టం. అటువంటి వీప్లవకారులలో దుర్గావతిదేవి ఒక విప్లవ వనిత. విప్లవవీరుడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లతో పాటు తప్పకుండా గుర్తుంచుకోవాలసిన వీరవనిత ఈమె.

బ్రటీష్ పోలీసులమీద ఒక మహిళ పిస్తోలు గురిపెట్టిన ఘనత ఈమెదే. జైలులో ఉన్న భగత్ సింగ్ ను విడిపించటానికి జైలుమీదకు బాంబుదాడి చేయాలని అందుకు అవసరమైన పథకాలను సిద్ధం చేసింది. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. ఇది తప్పించి ఈమె వేసిన ఎత్తుగడలు అన్నీ ఫలించాయి. ఈమెను నాటి విప్లవవీరులందరూ గౌరవంగా భాభీ అనిపిలచేవారు. ఆమె పేరులో కూడా చివర భాబి అనే పదం స్థిరపడింది. దుర్గావతి దేవి పంజాబ్ లోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. తల్లి బాల్యంలోనే మరణించింది. తండ్రి సన్యాసదీక్ష తీసుకుని వెళ్లిపోయాడు. ఈమె బంధువుల ఇంట పెరిగింది. ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఈమెకు 11వ ఏటనే వివాహం చేశారు. అప్పటికి దుర్గాబాయి 5వ తరగతి పూర్తి చేసింది.

ఈమె అత్తింటివారు గుజరాత్ లో ఒక సంపన్న కుటుంబంవారు. భర్తకు అప్పటికే విప్లవకారులతో పరిచయాలున్నాయి. తద్వారా దుర్గావతీకి కూడా విప్లవభావాలు కలిగాయి. విప్లవసంస్థకు సభ్యులను చేరుస్తూ విప్లవ సంస్థకు ప్రచారకార్యదర్శి అయింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే.

ఓర్తార్ సింగ్ అనే విప్లవవీరుని బ్రీటీష్ వారు ఉరితీయటం జరుగుతుంది. ఆ సందర్భంగా జరిగిన స్మృతిసభలో దుర్గావతి తన చేతిని కోసుకొని రక్తంతో ఆ విప్లవవీరుని చిత్రాన్ని గీసింది. ఈ ప్రసంగంలోనే ఈమెకు భగత్ సింగ్ పరిచయమవుతాడు. ఈ సభలో భగత్ సింగ్ ఉరితీయబడ్డ యువకుని గురించి ఆవేశంగా ప్రసంగిస్తాడు. ప్రసంగం ముగియగానే దుర్గావతి భగత్ సింగ్ కు వీరతిలకం దిద్దుతుంది.

భగత్ సింగ్, సుఖదేవ్ లు ఒకబ్రిటీష్ అధికారిని కాల్చిచంపి తప్పించుకుని లాహోర్ లోని దుర్గావతి ఇంటికి చేరతారు. లాహోర్ లో పోలీసులు వీరికోసం గాలిస్తుంటారు. వీరిని రక్షించటానికి ఈమె అద్భుతమైన పథకంవేస్తుంది. అప్పటికి ఈమె నెలల బిడ్డకు తల్లి.ఒక సాంప్రదాయ వనితగా, భగత్ సింగ్ భార్యగా నటిస్తూ బిడ్డను ఎత్తుకుని పోలీసుల కళ్ళుగప్పి రైల్వేస్టేషన్ చేరుకుని ఫస్ట్ క్లాస్ కంపార్ట మెంట్ లో హౌరాకు ప్రయాణిస్తారు. వీరు పరిచారకుడుగా సామాన్లు మోస్తూ రాజ్ గురు, సన్యాసిలాగా చంద్రశేఖర్ అజాద్ అదే రైలులో ప్రయాణించి హౌరాకు చేరుకుంటారు.

దుర్గావతి దేవి భర్త అప్పటికే కలకత్తాలోని విప్లవవీరుల నుండి బాంబులు తయారీ నేర్చుకుని నైపుణ్యం సంపాదిస్తాడు. వీరందరూ ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు పేల్చాలన్న నిర్ణయానికి వస్తారు. బాంబులు వేయటానికి భగత్ సింగ్ ముందుకు వస్తాడు. భగత్ సింగ్ కు బాంబులు ఇచ్చి అసెంబ్లీ భవనం వరకు దిగబెడుతుంది దుర్గావతి.

1929లో భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు పేల్చి లొంగిపోతాడు. భగత్ సింగ్ ను విడిపించటానికి బాంబులు తయారు చేస్తుండగా అవి పేలి దుర్గావతి భర్త మరణిస్తాడు. అప్పటికి దుర్గావతి వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. పోలీసులు ఈమె కోసం వెతుకుతుండగా బురఖా ధరించి బొంబాయి నగరం చేరుకుంటుంది. 1930 సంవత్సరంలో దక్షిణ ముంబాయ్ లో పురుషవేషం ధరించి కారులో వచ్చి కారులోనుండే పోలీస్ స్టేషన్ ముందున్న సిబ్బంది మీద కాల్పులు జరుపుతుంది. అది ఒక భారతీయ మహిళ ప్రత్యక్షంగా ఆయుధం ఉపయోగించిన రోజు అక్టోబర్8, 1930. ఈమె భగత్ సింగ్ ను ఉరినుండి తప్పించటాని బ్రిటీష్ అధికారులతో మాట్లాడమని గాంధీజీని కోరుతుంది. కానీ ఎందుకో గాంధీజీ నిరాకరిస్తాడు. కానీ ఈమెకు కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది.

స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ విప్లవవనిత ఘజియాబాద్ చేరుకుని తాను ఎవరో తెలియకుండా ఒక సామాన్య పాఠశాల ఉపాధ్యాయురాలిగా చేరుతుంది. ఆ తరువాత లక్నోలో సొంతంగా ఒకపాఠశాలను ప్రారంభిస్తుంది. 1956లో ఈమెను చూడటానికి ఒక్కసారి మాత్రం నెహ్రూ వచ్చాడంటారు. అది తప్పితే ఈమెను గురించి తెలిసి కూడా ఎవరూ కనీసం క్షేమసమాచారం అడిగిన దాఖలాలు లేవు. ఘజియాబాద్ లో అక్టోబరు 15వ తేదీన, 1999 సంవత్సరంలోనే 92వ ఏట దుర్గావతి మరణించింది.