ఇందిరా ప్రియదర్శిని భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలా నెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రి
జవహర్ లాల్ నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నుకోబడింది.
ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరింది. తర్వాత లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీతో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది.
1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరుగుతుంది.
ఈమెకు ఇద్దరు కుమారులు. వారు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. 1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ మరణించాడు.
తండ్రి మరణానంతరం ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది. 10-01-1966 లో ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది. 1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. 1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది
1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది. గరీబీ హటావో అనే నినాదం ఇందిరా గాంధీదే.
1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడటానికి సహాయం చేసింది. ఇందిరహయంలోనే రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిగింది.
తరువాత 1971లో అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు 1975లో చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడంతో (ప్రభుత్వ ఉద్యోగి యశ్ పాల్ శర్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకు) ఆ వత్తిడిని తట్టుకోలేక 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి విధించి, అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది. 1977లోఅత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి ఫలితం ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. తరువాత1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఉపఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత 1980మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో సారి ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది. ఆమె స్వయంగా ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
14-01-1980 న 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
ఆ సమయంలో సిక్కులు ఖింద్రేన్ వాలా నాయకత్వంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని లేవదీయగా ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో శిక్కుల స్వర్ణదేవాలయంలోనికి సైన్యాన్ని పంపి ఆ ఉద్యమాన్ని విజయవంతంగా అణచివేసింది. కానీ 3110-1984న ఉదయం 9గంటల16నిమిషాలకి ఆమె అంగరక్షకులైన ఇద్దరు శిక్కు గార్డుల కాల్పులకు గురై దుర్మరణం చెందింది.
భారతదేశ తొలి ఉపగ్రహమైన ఆర్యభట్ట 1975-04-19న ప్రయోగం ఇందిరా హయంలో జరపబడింది.
ఢిల్లీలో ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు.
ఆమె మరణించిన అక్టోబరు 31న ఇందిర పేరు మీద జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఇందిర హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, 1971 పాకిస్తాన్ యుద్ధంలో గెలుపు, బంగ్లాదేశ్ ఏర్పాటు, మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందింది.
కానీ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల ఇందిరాగాంధీకి చాలా చెడ్డపేరు వచ్చింది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.