కమలాదేవి ఛటోపాధ్యాయ సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు.
కమలాదేవి1903 ఏన్రియల్ 3వ తేదీన మంగళూరుకు చెందిన సంపన్న బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో జన్మించింది. అనంతయ్య ధారేశ్వర్, గిరిజాబాయి తల్లిదండ్రులు. విరికి ఈమె నాల్గవ కుమార్తె. తండ్రి మంగళూరు జిల్లా కలెక్టర్. తల్లి కర్నాటకలోని ఉన్నత కుటుంబానికి చెందినది. 1910లో కమలాదేవికి ఏడేళ్ల వయసులోనే అకస్మాత్తుగా తండ్రి మరణించాడు. ఆస్తి సవతి సోదరుడు ఆక్రమిస్తాడు, కుటుంబం కష్టాల పాలయ్యింది. తల్లి గిరిజాబాయికి ఆస్తి దక్కలేదు. తన బాధ్యతలను వీలైనంత త్వరగా తీర్చుకోవటానికి తల్లి కమలాదేవికి 14వ ఏట కృష్ణారావుతో వివాహం జరిపిస్తుంది. కానీ దువరదృష్టవశాత్తు రెండేళ్లలోనే 1919 లో భర్త మరణించడంతో కమలాదేవి కూడా విధవరాలైంది.
ప్రతిభాశాలి అయిన కమలాదేవి, వితంతువులకు చదువు అనవసరమని అడ్డుకున్నా, వారిని లెక్కచేయక చెన్నైలోని సెయింట్ మేరి పాఠశాలలో చేరి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. అక్కడున్నపుడే హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయను పెళ్ళాడి, వితంతు వివాహం చెల్లదన్న వాదాన్ని తిప్పికొట్టింది. హరీన్, కమల దంపతులకు రామకృష్ణ ఛటోపాధ్యాయ అనే కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత దంపతులు లండన్ చేరారు. కమలా దేవి బెడ్‌షోర్ కళాశాలలో చదివి, సోషియాలజీలో డిప్లొమా అందుకొన్నది. హరీన్‌తో ఎక్కువకాలం మనలేదు. కమలాదేవి దిక్కులేని ఒక మహిళను చేరదీసి కొడుకును చూసుకునే పనికి నియమించగా, హరీన్ ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటాడు. అది తెలుసుకొన్న కమలాదేవి వివాహబంధాన్ని వదలుకుని విడాకులు తీసుకుంది. వీరిద్దరి విడాకులు భారతదేశంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న సంఘటనల్లో మొదటి వాటిలో ఒకటిగా నమోదయ్యింది.
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన మహదేవ గోవింద రనాడే, గోపాలకృష్ణ గోఖలే, రమాబాయి రనాడే, అనిబీసెంట్ లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో మహాత్మా గాంధీ పిలుపు అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమం సేనాదళ్ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, పోలీసుల ఆంక్షలను లెక్కపెట్టక, ఎగురవేసిన సాహస వనిత కమలాబాయి. ఈమె జయప్రకాశ్ నారాయణన్,రామ్‌మనోహర్ లోహియాల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.
ఆమె నటనలో కూడా దిట్ట. కమలాదేవి ప్రాచీన సంస్కృతనాటకాలను, పద్మశ్రీ మహామాధవ చాకియర్ వద్ద గురుకుల పద్ధతిలో అభ్యసించింది. నాటకాల్లోనే కాక, వసంతసేన, తాన్‌సేన్, 1943 లో శంకరపార్వతి 1945లో ధన్నాభగత్ సినిమాల్లో నటించి పేరు గడించింది.
1939 లో ఇండియన్‌వుమెన్, జాతీయ నాటకరంగం మున్నగు రచనలు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత నాటక అకాడమీ, కేంద్ర కుటీర పరిశ్రమల ప్రదర్శనశాల, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మున్నగు సంస్థలకు శ్రీకారం చుట్టిన మేధావి కమలాదేవి. హస్తకళల ఆవశ్యకతను, సహకార సంస్థల ద్వారా సామాన్య ప్రజల సాంఘిక, ఆర్థిక ప్రగతి సాధించగలమన్న ఆశయంతో స్వాతంత్య్రానికి ముందు,
స్వాతంత్య్రం తర్వాత ఈమె విశేషకృషి చేసింది.
భారతదేశ గృహకుటీర పరిశ్రమల సముద్ధరణకు అవిశ్రాంతంగా చేసిన సేవలను గుర్తించి 1955లో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం గౌరవించింది. రామన్ మెగసేసే అవార్డు, శాంతినికేతన్ నుంచి 'దేశి కోత్తమ' సత్కారం అందుకొన్నది. కమలాదేవి ఛటోపాధ్యాయ తన 85వ ఏట 1988 అక్టోబర్ 29న మరణించారు.