కందుకూరి రాజ్యలక్ష్మి ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్య. ఈమెకూడా గొప్ప సంఘసంస్కర్త భర్త అడుగుజాడలలో పయనిస్తూ తన దృష్టి మొత్తం సమాజసేవమీద పెట్టి చివరివరకు భర్తనే అనుసరించింది.
కందుకూరి రాజ్యలక్ష్మి గోదావరి తీరంలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవటంతో మేనమామ ఇంటిలో పెరుగుతుంది. ఆడవారు బయటకు రాని ఆ రోజుల్లోనే బడికి వెళ్ళి విద్య నేర్చుకుంది. ఈమెకు 1860 సంత్సరంలో 9 ఏళ్ల వయసులో 13 సంవత్సరాల వీరేశలింగం గారితో వివాహం అవుతుంది.
రాజమహేంద్రనగరంలో 1881 డిసెంబర్ లో ఈ దంపతులు ఒక వితంతువుకి వివాహం జరిపిస్తారు. రాజమహేంద్రనగరమంతా ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ కందుకూరి రాజ్యలక్ష్మి ఒక్కతే తన భర్తకు బాసటగా నిలుస్తుంది.భర్తవెంట నిలచి వితంతువివాహాంలో అక్షింతలు వేసిన ముత్తయిదుగా చరిత్రలో నిలచిపోయింది.
తరువాత తన ఇంటిని విద్యాలయంగా మారుస్తుంది. మహిళలకు మధ్యాహ్నం పాఠాలు చెప్పేది. వంచించబడిన యువతులకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చింది. అనాధపిల్లల ఆశ్రయంగా తన ఇంటిని తీర్చిదిద్దింది. రోడ్డుమీద అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని ఆదరించి తన ఇంటికి తీసుకువచ్చి వైద్యసేవలు ఏర్పాటు చేసింది. తాను విగ్రహారాధనను వదలి స్త్రీలకొరకు ప్రార్ధనా మందిరాలను ఏర్పాటు చేసింది.
చరిత్రలో పెద్దగా పేరు సంపాదించని ఈ సంఘసంస్కర్త కందుకూరి రాజ్యలక్ష్మి 1910 ఆగస్టులో నిద్రలోనే ఈ లోకాన్ని వీడి వెళుతుంది.