నీర్జా భానోట్ పాన్ అమెరికా అనే విమానయాన సంస్థలో పనిచేస్తుంటారు.
1986 సెప్టెంబర్ 5న అమెరికాకు చెందిన పాన్ ఆమ్-73 విమానం ముంబైలోని సహార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి పాకిస్తాన్‌లోని కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో కరాచీలో ఆ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేశారు. అందులో ఉన్న 360 మంది ప్రయాణికులు, 19 మంది విమాన సిబ్బందిని నిర్బంధిస్తారు. అయితే అమెరికన్లే లక్ష్యంగా వచ్చిన ఉగ్రవాదులు వారిని వేరుచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నీర్జాకు ఓ ఉపాయం తట్టింది. ప్రయాణికుల వద్దున్న పాస్‌పోర్టులన్నింటినీ తీసుకుని దాచేస్తుంది. దీంతో ఉగ్రవాదులు అమెరికన్లెవరో? విదేశీయులెవరో తెలుసుకోలేకపోయారు. దాదాపు 17 గంటల పాటు డ్రామా నడిచింది. చివరకు లాభం లేదనుకుని విమానంలో బాంబులు పేల్చేందుకు సిద్ధమయ్యారు.
గంటల కొద్ది ఉగ్రవాదులను తికమక పెట్టిన నీర్జా ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. విమానంలోని అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు త్రోయటం మొదలుపెడుతుంది. దీన్ని గమనించిన తీవ్రవాదులు కాల్పులు మొదలు పెడతారు. పిల్లలపై తూటాల వర్షం కురిపిస్తుండగా చిన్నారులకు అడ్డుగోడగా నిలిచి వారి ప్రాణాలను రక్షిస్తుంది. నీర్జా మాత్రం కుప్పకూలుతుంది. వివిధ దేశాలకు చెందిన 20 మంది ప్రయాణికులు అప్పటికే కాల్పులలో చనిపోతారు. అయితే వందల మంది క్షేమంగా బయట పడటం వెనుక సాహసనారి నీర్జా ధీరత్వమే కారణం. ఉగ్రవాదుల తూటాలకు తీవ్రంగా గాయపడిన ఆ ధీరవనిత అదేరోజు సెప్టెంబర్ 5, 1986న ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.
హైజాక్‌కు పాల్పడిన ఐదుగురిని లిబియాకు చెందిన అబు నిదల్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులుగా గుర్తించారు. దోషులుగా గుర్తించిన కోర్టు 1988లో ఉరిశిక్ష విధించింది.
నీరజా భానోట్ ఒక చండీగఢ్ లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు రమాభానోట్, హరీష్ భానోట్. ఈమె తండ్రి ముంబైలో పత్రికా సంపాదకుడు. ఈమె సేక్రెడ్ హార్ట్ సీనియర్ సెకండరీ స్కూల్, చండీగఢ్, బోంబే స్కాట్టిష్ స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజ్, ముంబైలో చదువుకున్నారు. భానోట్ వివాహం గల్ఫ్ లో పని చేసే ఒక వ్యక్తితో 1985లో అయినప్పటికీ, ఆ పెళ్ళి ఫలించలేదు. వరకట్న వేధింపుల వలన ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసాక పాన్ అమ్ లో విమాన సేవకురాలిగా పని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎంపికైన తరువాత మియామీకి తర్ఫీదుకు వెళ్ళి తిరిగి వచ్చారు.
ఆమె సాహసానికి భారత ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పురస్కారం "అశోక చక్ర"ను అందజేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న పిన్న వయస్కురాలామె. 2004 లో భారత తపాలాశాఖ ఆమెపై ఒక తపాలాబిళ్ళను విడుదలచేసింది.
పాన్ ఆమ్ నుండి వచ్చిన ఇన్సూరెన్సు డబ్బు మరియు అంతే మొత్తం కలిపి భానోత్ తల్లిదండ్రులు "నీరజా భానోట్ పాన్ ఆమ్ ట్రస్టు"ను ఏర్పాటు చేసారు. ఈ ట్రస్టు ప్రతి సంవత్సరం రెండు పురస్కారాలను అందజేస్తుంది. అందులో ఒకటి విమాన సర్వీసులలో విశేష సేవలందించేవారికి మరియు రెండవది సామాజిక న్యాయం అవసరమైన వరకట్న వేదింపులకు గురై సాంఘికంగా బాధలు పడుతున్న స్త్రీకి అందజేస్తారు. ఈ అవార్డు రూ.1,50,000 నగదు మరియు ఒక ట్రోఫీ రూపంలో యిస్తారు.
రామ్ మధ్వాని దర్శకత్వంలో నీర్జా భానోత్ కథను సినిమా తీశారు. నీర్జా భనోత్‌గా సోనమ్ కపూర్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 19, 2016 న విడుదల అయింది