ప్రీతిలత వడ్డేదార్ సాంప్రదాయ పశ్ఛిమ బెంగల్ లోని ఒక బెంగాలీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి బ్రీటీష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రీతిలత సహజంగానే తెలివితేటలు కలది. హైస్కూల్, కాలేజ్ చదువులు ఢాకా, కలకత్తాలో పూర్తిచేసి డిగ్రీ పట్టా పొందింది. కాలేజ్ లో చదివేటప్పుడే ఈమె క్రమక్రమంగా ఈమె విప్లవం బాట పట్టింది. విప్లవవీరుల చరిత్రలు సేకరించి చదివేది. బ్రిటీష్ ప్రిన్సిపాల్ కు అనుమానం వచ్చింది. బి.ఏ డిగ్రీ పాసైనా కూడా అసలు డిగ్రీ పట్టా ఇవ్వకుండా కేవలం ప్రొవిజనల్స్ ఇచ్చి పంపారు.
తరువాత ప్రీతిలత చిట్టగాంగ్ చేరుకుంది. అక్కడ స్కూల్ హెడ్ మిసెస్ గా నియమించబడ్డది. కానీ ఆమె దృష్టి అంతా విప్లవం మీదే ఉంది.
నాడు బెంగాల్ విప్లవవీరుడు సూర్యసేన్ ను రైలు ట్రెజరీ దోపిడి నేరం కింద బ్రిటీష్ వారు అరెస్ట్ చేసి దారుణంగా హింసించి ఈడ్చుకెళ్లారు. ఈ దృశ్యం ప్రీతిలత కళ్లల్లో మెదులుతుండేది. డిగ్రీ చదువుతుండగానే జైలులో ఉన్న విప్లవవీరుడు బిస్వాస్ ను40 సార్లు కలిసింది. పోలీసులను బిస్వాస్ చెల్లెలునని చెప్పి నమ్మించింది. కానీ నిజానికి ఆమె విప్లవ సంస్థకు సమాచారం చేరవేసేది. ఆయుధాలను కూడా చేరవేయటానికి సాయపడింది.
సూర్యసేన్ బృందం చిట్టగాంగ్ ఆయుధాగారం మీద విజయవంతంగా దాడి చేసారు. తరువాత తప్పించుకొని జలాలాబాద్ కొండలలో దాక్కున్నారు.
అప్పుడు ప్రీతిలత సూర్యసేన్ బృందాన్ని రహస్యంగా కలిసి తదుపరి కార్యక్రమాల గురించి చర్చలు జరిపింది. అది 1932 సంవత్సరం జూన్ 13వ తేది. ఈ సమాచారం పోలీసులకు తెలిసి సూర్యసేన్ బృందం ఉన్న ఇంటిని చుట్టుముట్టింది.
ప్రీతిలత, బ్రీటీష్ పోలీసులకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ కామెరూన్ ను కాల్చి చంపివేసింది. సూర్యసేన్ బృందం, ప్రీతిలత, ఇంకొక విప్లవకారిణి కల్పనాదత్ తప్పించుకున్నారు.
తరువాత ఈ బృందం బ్రిటీష్ వారి యూరోపియన్ క్లబ్ మీద దాడిచేయాలను కున్నారు. ఈ క్లబ్ ముందు కుక్కలకు, భారతీయులకు ప్రవేశం లేదు అనే బోర్డు తగిలించారు బ్రిటీష్ వారు. ప్రీతిలత ఆయుధాల వాడకంలో శిక్షణ పొందింది. గెరిల్లాయుద్ధం తనతో పాటు మిగతా విప్లవకారులకు కూడా నేర్పింది.
1932వ సంవత్సరం సెప్టెంబర్ 23న యూరోపియన్ క్లబ్ మీద దాడికి ముహూర్తంగా నిర్ణయించారు విప్లవకారులు. నాలుగు వైపుల నుండి విప్లవకారులు క్లబ్ ను చుట్టుముట్టి కాల్పులు సాగించారు. ప్రీతిలత అడ్డువచ్చిన వారిని కాల్చివేసింది. బ్రీటీష్ వారు కూడా ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. విప్లవకారులు గేటుమందున్న బోర్డును తీసివేసారు.
కానీ ఎదురు కాల్పుల్లో ప్రీతిలతకు బుల్లెట్ తగిలింది. తప్పించుకునే ప్రయత్నంలో కొంతదూరం వెళ్లి పడిపోయింది. బ్రిటీష్ వారికి దొరకటం కన్నా చావే మేలకుని తన దగ్గర సిద్ధంగా ఉంచుకున్న సైనెడ్ గుళికను మింగి ప్రాణాలు వదిలింది సాహసవనిత ప్రీతిలత. అప్పటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే (1911-1932)