header

Rani Abbakka, Ullala, Karnataka…చరిత్ర మర్చిపోయిన వీరనారి ఉల్లాల(కర్నాటక) రాణి అబ్బక్క....

Rani Abbakka, Ullala, Karnataka…చరిత్ర మర్చిపోయిన వీరనారి ఉల్లాల(కర్నాటక) రాణి అబ్బక్క....
Rani Abbakka, Ullala, Karnataka…చరిత్ర మర్చిపోయిన వీరనారి ఉల్లాల(కర్నాటక)  రాణి అబ్బక్క.... రాణి అబ్బక్క కర్నాటక ప్రాంతంలోని ఉల్లాల ప్రాంతానికి రాణి. ఈమె పరిపాలనా కాలం క్రీ.శకం 1525 నుండి క్రీ.శకం 1570 వరకు. ఝాన్సీ లక్ష్మీ బాయ్ కంటే మూడువందల సంవత్సరాల క్రితం విదేశీయులను నిలువరించిన గొప్ప పరాక్రమవంతురాలు. ఈమె జైన మతస్థురాలు. కానీ రాజ్యంలో అధికభాగం ప్రజలు హిందువులు, ముస్లింలు. కానీ అందరూ ఈమె పరిపాలనను అంగీకరించి రాణి నాయకత్వంలో పనిచేసారు.
ఈమె తన మామయ్య పెంపకంలో పెరిగింది. అన్నివిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది. తరువాత ఈమె మామయ్య ఉల్లాలకు రాణిగా పట్టాభిషక్తురాలను చేసాడు. నాటి జాలరులు, నౌకాదళవీరులు ఈమెకు పూర్తి మద్ధత్తు తెలిపారు.
అప్పటికి బ్రీటీష్ వారు ఇండియాలో ప్రవేశించలేదు. పోర్చుగీసు వారు దాడిచేసి గొవాను ఆక్రమించు కున్నారు. వీరి దురాగతాలకు అడ్డులేకుండా పోయింది. దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసారు. కత్తులు చూపి భయపెట్టి మతమార్పిడి చేసారు. వీరు 1525 సం.లో మంగుళూరు సమీపంలోని ఒక కోటమీద దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీనికి సమీపంలోని రాజ్యం రాణి అబ్బక్కది. అప్పటికే ఈ రాజ్యం నౌకాశ్రయపరంగా అభివృద్ధి చెందినది. పలురకాల వ్యాపార కూడలి మరియు అరేబియాతో వ్యాపార సంభందాలు కూడా బలంగా ఉన్నాయి.
ఈ రాజ్యంమీద పోర్చుగీసువారు దండయాత్ర చేసారు, కానీ రాణి అబ్బక్క వీరిని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టింది. అంతే కాదు ఇరుగు పొరుగు రాజ్యాలతో స్నేహం చేసి వారి మద్దత్తు సంపాదించింది. వారందరికీ నాయకత్వం వహించి తాను ముందుండి పోరాడింది.
భర్తతో విభేధాలు వచ్చి విడిపోయి స్వతంత్రంగా రాజ్యపాలన నిర్వహించింది. బీజపూర్ సుల్తానులు, పొరుగు రాజ్యాల రాజులు ఈమెకు మద్ధత్తు తెలిపారు. పోర్చుగీసు వారిని ఎదుర్కునేందుకు సమద్రం మీద యుద్ధం చేయగల సైన్యాన్ని తయారు చేసుకుంది. కోటలను పటిష్టం చేసుకుంది. పోర్చుగీసు వారు ఉల్లాల మీద తరచుగా దండెత్తటం మొదలు పెట్టారు కానీ ప్రతిసారి ఓడిపోవటం జరిగింది. బాణాలకు కాగాడాలను కట్టి శత్రువులమీద ప్రయోగించిన మొదటి వ్యక్తిగా ఈమెను చెబుతారు.
కానీ ఈమె భర్త అసూయతో పోర్చుగీసువారితో చేతులు కలిపి కోట రహస్యాలు వారికి చెప్పటం జరిగింది. దీనితో రాణి ఒకసారి ఒడిపోయి వేరే చోట తలదాచుకుని కేవలం రెండు రోజులలో సైనిక శక్తిని కూడగట్టుకుని తన కోటలో ఉన్న పోర్చుగీసు జనరల్ ను చంపివేసింది, సముద్రమార్గంలో వస్తున్న నౌకాదళ అడ్మరల్ ను కూడా పరలోకానికి పంపించింది.
కోట తిరిగి స్వాధీనమవుతున్న దశలో భర్త చేసిన ద్రోహం వలన పోర్చుగీసు వారికి బందీగా చిక్కింది. ఈమె జైలులో పొర్చుగీసు వారిమీద సాహసంతో తిరగబడటం వాలన వారు రాణిని చంపివేసారు. తుళు ప్రాంతవాసులు ఇప్పటికీ ఈమె కథలను యక్షగానాలలో ప్రదర్శించేవారు.
టిప్పూ సుల్తాన్, ఝాన్సీలక్ష్మీబాయ్, రాణి రుద్రమ, రజియా సుల్తాన్ గురించి చరిత్రలో పేర్కొనటం జరిగింది కానీ వీరనారి రాణి అబ్బక్క గురించి భారత దేశచరిత్రలో లిఖించకపోవటం దురదృష్ణం.
2003 సం. జనవరి 15 తేదీన భారతప్రభుత్వం రాణి అబ్బక్క గౌరవార్ధం ప్రత్యేక తపాల కవర్ ను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఉల్లాల ప్రాంతంలో రాణి అబ్బక్క ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఉల్లాలలోను, కర్ణాటకలోనూ రాణి అబ్బక్క కంచువిగ్రహాలు స్థాపించారు. కర్నాటక రాజధానిలో ప్రధాన రోడ్డుకు ‘రాణి అబ్బక్క రోడ్’ అనే పేరు పెట్టబడింది. భారతీయ నౌకాదళ గస్తీనౌక కూడా ‘రాణి అబ్బక్క’ పేరు పెట్టబడింది. చరిత్రకారులు రాణి అబ్బక్కను విదేశీయులపై పోరాడిన తొలి వీరనారిగా పేర్కొంటారు.