header

"Rani Durgavathi

దుర్గావతి
Rani Durgavathi దుర్గావతి బుందేల్ ఖండ్ కు చెందిన చందవేల్ రాజుగారి కుమార్తె దుర్గావతి. గొప్ప అందకత్తె. 16వ శతాబ్దమునకు చెందిన చందవేల్ బుందేల్‌ఖండు సంస్థానములో ప్రసిద్ధికెక్కిన రాజులలో మొదటివాడు
దుర్గావతి రూపగుణముల గురించి విని, చాలామంది రాజపుత్రు లామె కొరకు చందేల్ రాజును ఆశ్రయించుచుండిరి. కాని, రాజపుత్రులు తన కూతురుకు దగినవారు కారని తలచి, చందేల్ రాజు వారికేదో యొక కారణముచెప్పి నిరాకరిస్తుంటారు. ఒకసారి గడామండలా సంస్థానాధిపతియగు గోండు రాజు దుర్గావతిని తనకిమ్మని ఆమె తండ్రిని కోరతాడు ఈ గోండు రాజుయొక్క శౌర్య సాహసములను గురించి చారులచే వినినది గావున, కూడా ఇతనని దుర్గవతి ఇష్టపడుతుంది. గోండు జాతి, రాజపుత్రులకంటె తక్కువజాతి వారు. వీరు అనార్యులు. కనుక తన కూతురును ఇచ్చుటకు చందేల్ రాజునకు ఇష్టము లేదు. కాని, గోండురాజు అమిత బలవంతుడు. గడామండల రాజ్యమంతగా గొప్పది కాకపోయినను, అతడు మిక్కిలి బలవంతుడై, అతనికి తోడుగా అనేక మంది రాజులు ఉన్నారు. ఇతనితో విరోధము తగదని దుర్గావతి కూదా అతనిని ఇష్టపడుతుందని తెలిసి, చందేల్ రాజు గడామండలేశ్వరునకు తన కూతురునిచ్చి మహావైభవముతో వివాహము చేసెను.
వివాహము జరిగిన తరువాత అత్తవారింటికి వచ్చునప్పుడు దుర్గావతి, తండ్రి రాజ్యమునందున్న బీదసాదలు అనేకులకు శాశ్వత జీవనము కల్పించెను. అందువలన వారందరామెను తమపాలిటి దైవమని భావించి యామె కనేకములైన దీవనలను ఇస్తారు. ఈమె గడామండలమునకు వచ్చినతరువాత గొండు రాజు, రాజ్యపాలన యందు నిర్లక్ష్యము వహించి, భార్య యందు మోహితుడై నర్మదానదీతీరమునను, అచ్చటనున్న ఉద్యానవనాలలో విహరించుచు కాలము గుడుపుచుండెను. అనేక పర్యాయములు దుర్గావతి రాజ్యమును గురించి పట్టించుకొనమని రాజునకు సూచించెను గాని, విషయాసక్తుడయిన రాజు ఆ మాటలను లక్ష్యపెట్టడు. కొంత కాలమునకు రాణి దుర్గావతీ గర్భం ధరించి ఒక పుత్రునికి జన్మనిస్తుంది. ఆ పుత్రునికి పది సంవత్సరముల ప్రాయము వచ్చినప్పుడు, రాజుగారు అంతుపట్టని రోగముచేత మరణిస్తాడు.
రాజ్యపాలనా బాధ్యత దుర్గావతిమీద ఉన్నందువలన నామె తన కుమారుని సింహాసనంమీద కూర్చుండబెట్టి, అతని పేరిట తానే రాజ్యపరిపాలన చేయసాగింది. ఆమె తన భర్త వలె గాకుండా, దక్షతతో, న్యాయముతో, రాజ్యపరిపాలనము చేయసాగింది.
మొగలాయి రాజైన అక్బరుబాదుషా ఈమెను గురించి విని, ఈమె తనకు సామంతునిగా ఉండవలయునని నిర్ణయించుకుంటాడు. అక్బరు, ఆసఫ్‌ ఖాన్అను ప్రసిద్ధవీరుని 1564 వ సంవత్సరమున దుర్గావతి రాజ్యముపైకి యుద్ధానికి పంపుతాడు
ఈ సంగతి తెలిసి , దుర్గావతి భయపడక, మహా థైర్యముతో యుద్ధమునకు సిద్ధపడుతుంది. కొద్దికాలములోనే 500 ఏనుగులను 5000 గుర్రాలను, గొప్ప కాల్బలములను సిద్ధం చేసుకుంటుంది. తాను పురుషవేషము ధరించి, ఆయుధములను తీసుకుని, ఏనుగుపై నెక్కి ప్రత్యక్షదుర్గవలె యుద్ధభూమికి వస్తుంది! ఆమెనుజూచి సైనికుల కందరికీ ఉత్సాహము గలిగి మొగల్ సైన్యాన్ని ఎదుర్కొంటారు. మహావీరుడని ప్రఖ్యాతిని గాంచిన ఆసఫ్‌ఖాన్ కొద్దిసైన్యముతో ఈమెను జయించుట కష్టమని , మరునాడు ఎక్కువ సైన్యమును తీసికుని, తమవద్దనున్న ఫిరంగిలన్నియు ముందుభాగాన నిలిపి, గోండు సైనికులపై అకస్మాత్తుగా దాడిచేసి తన సామర్థ్యమంతయు చూపిస్తాడు. ఇట్టి పరిస్థితులలో, దుర్గావతీ కుమారుడు చిన్నవాడైనా, అభిమన్యుడి వలె శత్రువులను ఎదిరిస్తాడు. ఇట్లు కొంతసేపు మహాధైర్యముతో పోరాడి శత్రుసైనికుల బాణాలచేత గాయపడి మూర్చపోతాడు. అప్పుడు సైనికులు ఈ వార్తను దుర్గావతికి తెలియచేస్తారు. ఆమాటవిని, విచారించుటకు సమయము కాదని సైనికులకు తెలిపి పుత్రవాత్సల్యమును చంపుకొని, తనసేనాధిపతితో . "ఈసమయము ధైర్యమును వదలి విచారించుట తగదు. శత్రువులను నాశనంచేయుట మన ముఖ్యకర్తవ్యము. పిల్లవానిని శిబిర మునకు గొనిపోయి తగిన చికిత్స చేయించండి. నేను యుద్ధమును విడిచి వచ్చుటకు వీలులేదు. యుద్ధమును సమాప్తముచేసి, ప్రాప్తియున్న మరల జూచెదను." అని చెబుతుంది. సైనికులు అదేవిధంగా చేస్తారు
యుద్ధమునందు కొంతసేపు వీరిదే పైచేయు అవుతుంది, కొంతసేపు కానీ ఎవరు గెలుస్తారో చెప్పటానికి వీలుకాని పరిస్థితులు ఉభయపక్షాలు సమానంగా పోరాడుతుంటారు. కొంతసేపటికి గోండుసైనికులు పోరాడి పోరాడి, అలసిపోతారు. మొగలులు రెచ్చిపోయి మహా భయంకరంగా యుద్ధం చేస్తారు. మూడువందల సైనికులతో దుర్గావతిరాణి బ్రతికి భయంకరముగా పోరాటం చేస్తుంది. దుర్గావతితో యుద్ధం చేయటానికి ఆసఫ్‌ఖాన్ స్వయముగా వస్తాడు. కాని ఆమె రౌద్రరూపాన్ని చూసి భయపడతాడు దూరంనుండి ఆమెపై బాణవర్షమును కురిపిస్తాడు. ఆమె ఆ బాణముల నన్నిటిని త్రిప్పకొడుతుంది.. కాని ఒక బాణము శిరస్సునందు గ్రుచ్చుకొనగా ఆమె మరింత కోపంతో ఆ బాణమును తీసి, మరింత రౌద్రముతోయుద్ధము చేస్తుంది! అప్పు డామె శరీరమంతయు రక్తసిక్తమవుతుంది. ఆమెను తప్పించుకుని వెళ్ళమని సైనికులు సలహా ఇస్తారు. కానీ రాణి శత్రువులకు వెన్నుచూపడం ఇష్టంలేక తనను తాను ఖడ్గంతో పొడుచుకొని మరణిస్తుంది. రాణీగారి శవము మ్లేచ్ఛులచే కంటబడకుండా ఆమె సేవకుడు భద్రపరచి, తానును యుద్ధముచేసి యచటనే చనిపోతాడు! రాణీగారి కుమారుడు కూడా మరణిస్తాడు. అక్బర్ దురాశ చేత గోండు రాజ్యం నాశనమవుతుంది.
రాణి దుర్గావతి సమాధి జబల్పూర్ లో ఉన్నది దీనికి సంబంధించిన శిలాశాసనంను ఇక్కడనే చూడవచ్చు. ఇక్కడకు వచ్చే పర్యాటకులందరూ ఈమె చరిత్రను గురించి తెలుసుకొని గౌరవంతో సమాధికి నమస్కరిస్తుంటారు.
1983 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది
భారత ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారకంగా ఆమె పేరుతో 24 జూన్, 1988 తేదీన ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. జబల్పూర్ మరియు జమ్మూతావీ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలుకు (11449/11450) దుర్గావతి అనే పేరు పెట్టారు.