`
రజియా సుల్తాన్ అసలు పేరు రజియా ఆల్ దీన్.
కానీ చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానాగా ప్రసిద్ ఈమె ఢిల్లీ సింహాసనంపై
కొద్దికాలం మాత్రమే ఉంది. క్రీ.శ. 1236 నుండి 1240 వరకు.
ఈమె సెల్జుక్ వంశానికి టర్కిష్ మహిళ, ఈమె సైనిక విద్య, కవాతు, ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నది. టర్కిష్ చరిత్రలోనూ మరియు ముస్లింల చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తి.
ఈమె తండ్రి షంసుద్దీన్ అల్తమష్ ("ఇల్‌టుట్ మిష్") తరువాత, ఇతని వారసురాలిగా ఢిల్లీ సింహాసనాన్ని 1236 లో అధిష్టించింది. కానీ ముస్లిం నాయకులు ఒక మహిళ సుల్తాన్ గా ప్రకటించబడడం జీర్ణించుకోలేక, రజియా అన్నయైన రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను అల్తమష్ ను రాజుగా ప్రకటించారు.
రుక్నుద్దీన్ పరిపాలన చాలా తక్కువకాలం సుల్తాన్ గా ఉంటాడు.. అల్తమష్ భార్యయైన షాహ్ తుక్రాన్, తన కుమారుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి తానే అధికారాలు చెలాయించేది. రుక్నుద్దీన్ వ్యసనపరుడైనందున ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. నవంబరు 9, 1236 న షాహ్ తుక్రాన్ మరియు రుక్నుద్దీన్ చంపబడతారు. రుక్నుద్దీన్ కేవలం ఆరునెలలు మాత్రమే సుల్తాన్ గా ఉన్నాడు.
రజియా సామర్ధ్యం దృష్ట్యా, ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించేందుకు ప్రజలు సుముఖత చూపారు. రజియా అందరు అంతఃపుర స్త్రీలలా వుండేది కాదు. ప్రజలలో ఒకరిగా వుండేది. ప్రజలతో సంబంధాల కారణంగా మంచి పేరు, గౌరవం, పలుకుబడి సంపాదించుకుంది. తన తండ్రి కాలంలో తండ్రితోనే వుంటూ రాజవ్యవహారాలను చక్కగా నేర్చుకుంది. పురుషునివలె దుస్తులు ధరించి సైనికులతో తిరిగేది. యుద్ధాలలో ముందుండి తానే నాయకత్వం వహించేది.
రాజతంత్రాలలో ఆరితేరిన రజియా, తనకు వ్యతిరేకులైన టర్కిష్ ప్రతినిథులను సామంతులను అవలీలగా నిలువరించగలిగింది. తన వ్యతిరేక వర్గాల మధ్య వ్యతిరేకతను సృష్టించి తన సింహాసనాన్ని భద్రపరచుకో గలిగినది.
కానీ రజియా తన సలహాదారులలో ఒకడైన జమాలుద్దీన్ యాకూత్, ఒక అబిసీనియన్ దాసుడు పట్ల ఆకర్షితురాలవటం వలన ఇతర ప్రతినిధుల కోపాన్ని చవిచూడవలసివచ్చింది. ఒక అబిసీనియన్ దాసుడికి రజియా దాసురాలవడం వీరు సహించలేక పోయారు. రజియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రజియా చిన్ననాటి స్నేహితుడు మరియు భటిండా గవర్నరు అయిన మాలిక్ ఇక్తియారుద్దీన్ అల్తూనియా, ఈ వ్యతిరేక వర్గాలతో చేయి కలిపాడు. వీరందరూ రజియా మీదకు యుద్దానికి వస్తారు. రజియా మరియు అల్తూనియాల మధ్య జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడతాడు, రజియాను చెరసాలలో పెడతారు. గత్యంతరం లేని పరిస్థితులలో రజియా అల్తూనియాను వివాహమాడింది. ఈ మధ్యకాలంలో రజియా అన్నయైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమిస్తడు. రజియా సుల్తానా, అల్తూనియా ఇద్దరూ కలిసి ఢిల్లీని తిరిగి దక్కించుకోవటం కోసం యుద్ధానికి వస్తారు. కానీ ఈ యుద్ధంలో అల్తూనియా మరియు రజియా అక్టోబరు 14, 1240 న, ప్రాణాలు కోల్పోయారు.
రజియా పరిపాలన
రజియా, సుల్తానుగా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది, ఈవిషయం ఇతర ముస్లిం ప్రతినిధులను కోపాన్ని తెప్పించింది. ఇందుకు సమాధానంగా, రజియా, ముస్లింల భావాలకన్నా ఇస్లాం సూత్రాలు ముఖ్యమనీ ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఉటంకించింది,
‘‘ముస్లిమేతరులపై భారాలను మోపకండి’’ - ముహమ్మద్ ప్రవక్త ”
ఇంకో సందర్భంలో రజియా, క్రొత్తగా ఇస్లాంను స్వీకరించిన ఒకరికి ఉన్నత స్థానంగల హోదానిచ్చింది, ఈ చర్యను టర్కిష్ నోబుల్స్ వ్యతిరేకించారు
రజియా తన రాజ్యంపట్ల తన ప్రజలపట్ల అమిత శ్రద్ధాశక్తులు చూపేది. ప్రజాక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇతర రాజులమాదిరి, ప్రజలనుండి దూరంగా వుండక, ప్రజలలోనే ఒకరిగా తిరుగుతూవుండేది. పరమత సహనం ఈమె ఆభరణము. ఈమె హిందూమతావలంబీకుల పట్ల చూపించే అభిమానం పట్ల, సమకాలీన ముస్లిం చరిత్రకారులు వ్యతిరేకత వ్యక్తపరిచారు.
రజియా, పాఠశాలలను, విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, ప్రజాగ్రంధాలయాను స్థాపించింది. ఈ సంస్థలలో, ప్రాచీన తత్వవేత్తలపై, ఖురాన్ పై, హదీసులపై పరిశోధనలు సాగేవి. హిందు ధర్మశాస్త్రాలు, తత్వము, ఖగోళశాస్త్రము మరియు సాహిత్యమునూ ఈ పాఠశాలలు, కళాశాలలో అధ్యయనా విషయాలుగా వుండేవి. రజియాను ఎవరైనా "సుల్తానా" అని సంబోధిస్తే, నిరాకరించేది. సుల్తానా అనగా 'సుల్తాన్ గారి భార్య' అని అర్థం వస్తుంది. తననెప్పుడూ "సుల్తాన్" అని పిలవమని కోరేది.