header

Sarada Mata

శారదామాత
sarada mata రామకృష్ణ పరమ హంస ధర్మపత్ని శారదాదేవి. భర్తతో సమానంగా తత్వచింతన కలిగిన ఉత్తమురాలు. భక్తులకు తల్లివంటిది. రామకృష్ణుల వారి మరణం తరువాత భక్తులకు మార్గదర్శనం చేసింది ఈమే. భక్తులు శారదామాతను ఆదిపరాశక్తి మారురూపంగా కొనియాడతారు. శారదాదేవి తండ్రి ఒక పేద పూజారి
శారదాదేవి ఐదవ ఏట కాళికాదేవి మందిరంలో పూజారిగా పనిచేసే గదాధర ఛటోపాధ్యాయకిచ్చి (రామకృష్ణ హంస అసలుపేరు)పెండ్లిచేశారు. పద్నాలుగవ ఏట కాపురానికి వచ్చిన శారదాదేవికి రామకృష్ణ పరమహంస సంసారిక అంశాలమీదకన్నా ఆధ్యాత్మిక అంశాలమీద బోధన ప్రారంభించాడు. నాటివరకు రామకృష్ణ పరమహంసను పిచ్చివాడిగా చూస్తారు. కానీ శారదాదేవి ఆయనలోని జ్ఞానం గురించి, ఋషిస్థాయి గురించి వివిరించాక రామకృష్ణ పరమహంస అసలు మహత్యం తెలుసుకుంటారు. శారదామాత ఇతనిని భగవత్ స్వరూపంగా భావించేది. శారదాదేవిని అమ్మవారిగా భావించి పూజలుచేసేవారు రామకృష్ణ పరమహంస.
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు లేచి భగీరధి, హుగ్లీ నదీ సంగమ ప్రాంతంలో స్నానం చేసి తెల్లవారేవరకు ధ్యానం చేసేది. భర్త అందించిన మంత్రాన్ని సాధనచేసి ఇతరులకు గురువుగా నిలవగలిగింది శారదామాత. జపం చేసుకునే సమయం తప్పించి ఆయనను చూడటానికి వచ్చిన వారికి అవసరమైన ఆహారాలను వండటంలోనే గడిపేది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరినా భర్తతోటిదే లోకంగా మెలగేది. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరెందరో మహిళలు ఆద్యాత్మిక రంగం వైపు మళ్లారు.
ధవళవస్త్రం, పోడవైన కురులు, కుడిభుజంమీదనుండి ముందుకు వేలాడుతూ, పద్మాసనంలో ధ్యానం చేయటం ఆమెకు అలవాటు. ఈ రూపమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది.
రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న చివరి రోజులలో శారదామాత ఆయనను బిడ్డలా చూసుకొని సేవలు అందించింది. భర్తనుండి పవిత్రమంత్రాలు నేర్చుకొని, ఇతరులకు గురువుగా ఉండేందుకు అవకాశం రామకృష్ణలవారు కల్పించినా భర్తసేవగురించి ఆలోచించింది కానీ గురుస్థానాన్ని గురించి ఆలోచించలేదు. 1886 ఆగస్టులో రామకృష్ణుల వారు చనిపోయిన తరువాత ముత్తైదువకు సంబంధించిన గుర్తులను తీసువేయాలనుకుంది కానీ రామకృష్ణుల వారు కలలో కనిపించి తాను చనిపోలేదని మరోరూపంలో జన్మించానని చెప్పటంతో ఈ ప్రయత్నం విరమిస్తుంది. భర్త మరణం తరువాత ఈమె భారతదేశ తీర్థయాత్రలకు వెళ్లి కాశీవిశ్వేశ్వరుని, అయోధ్యను, బృందావనాన్ని దర్శించింది. బృందావనంలో ఉండగాభక్తులంతా ఆమెను శారదాదేవిగా పిలవటం మొదలుపెట్టారు.
ఉత్తరభారత యాత్ర తరువాత శారదాదేవి రామకౄష్ణుని స్వగ్రామమైన కామార్పుకుర్ కి వస్తొంది. అక్కడ వున్న రెండు సంవత్సరాలలో ఆమె ఆర్థిక సమస్యలతో బాధపడటం జరుగుతుంది. కడుపేదరికం, చినిగిన బట్టలు, రోజూ చెరువుకు వెళ్లి తన బట్టలు తానే ఉతుక్కొనేది. కొన్నసార్లు ఆహారం లేక పస్తులు.ఈ విషయం తెలుసుకున్న కలకత్తాలోని ఈమె భక్తులు తిరిగి ఈమెను 1888లో కలకత్తాకు తీసుకువచ్చారు. ఆమెకోసం ప్రత్యేకంగా ఇంటిని నిర్మించి అందులో ఆమెను ఉంచుతారు. ఆ ఇంటి పేరు ఉద్భోధన. అందులో ఉంటూ ఆద్యాత్మిక బోధనలు చేస్తుండేది. సిస్టర్ నివేదిత, సిస్టర్ దేవమాత వంటివారుఆమె లోని ఆధ్యాత్మిక సంపదకు, హైందవ స్త్రీతత్త్వా్నికి ఎంతగానో అబ్బురపడేవారు..
రామకృష్ణ దంపతులకు పిల్లలు లేరు. కానీ ఆ గృహం దర్శించుకునే వారిని సొంత బిడ్డలా చూసుకునేది. తానే భోజనం వడ్డించి విస్తరాకులు కూడా తనే తీసేది. ఆరోగ్యం ఎలా వున్నా తన దినచర్య గంగానదిస్నానం మాత్రం మానేది కాదు. శారదామాత తమకు కలలో కనిపించిందని మంత్రోపదేశం చేసిందని చాలామంది చెప్పేవారు. కానీ వీరికి గతంలో శారదామాత ఎవరో తెలియదు.
అలా దాదాపు 30 సంత్సరాలపాటు ఆధ్యాత్మక చింతననను శిష్యులకు పంచిన శారదా దేవి 1919లో జయరాంబటి వెళ్లి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండిపోయింది. ఆమె ఎక్కడ వుంటే అక్కడికే శిష్యులు వచ్చేవారు.
ఆమె ఆరోగ్యపరిస్థితి బాగాలేకపోవటంతో శిష్యలు ఆమెను తిరిగి కలకత్తాకు తీసుకువచ్చారు. 1920 నుండి ఆమె కలకత్తాలో ఉంది. కానీ ఆమె ఆరోగ్యం మరింత పాడవుతుంది.
తన శిష్యలను పిలచి మీకు మానసిక శాంతి కావాలనుకుంటే ఇతరులలో లోపొలు వెతకకండిన మీలోని లోపాలను ముందుగా చూసి సరిదిద్దుకోండి. ప్రపంచమంతా మీరే అనేకోండి. ఈ లోకంలోకి వచ్చినవారు ఎవరూ అపరిచితులు కారు. అందరూ ఏదో ఒకరకమైన సంబంధం కలిగినవారమే అని చివరి సందేశం ఇస్తుంది.
1920 జూలై 20వ తేదీన అర్ధరాత్రి శారదామాత రామకృష్ణులవారిని చేరుకుంటుంది. బేలూరు మఠంలో ఆమెకు అంత్యక్రియలు జరిపారు. ఆ ప్రదేశంలో నేడు ఒక మందిరం ఉంది. ఇప్పటికీ ఆమె భక్తులకు సమాధానం చెపుతుందని అంటారు.