header

Savtribai Phule

సావిత్రిబాయి ఫూలే
Savtrbhai Phule సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో పేరుపొందిన సంఘ సంస్కర్తలలో ఒకరు ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఈమె మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది . వీరిది పేద రైతుకుటుంబం. ఆనాటికి బాల్యవివాహాల సాంప్రదాయం బలంగా ఉండేది. సావిత్రిబాయికి కూడా తొమ్మిదవ సంవత్సరంలోనే 22 యేండ్ల జ్యోతిరావుపూలేతో 1840 సంవత్సరంలో వివాహం జరుగుతుంది. ఆ దంపతులకు పిల్లలు లేరు వీరు ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడైన యశ్వంతరావును దత్తత తీసుకుంటారు
సావిత్రిబాయి భర్త నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుంటాడు. ఈమె కులమత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమమూర్తి. ఆధునిక విద్యద్వారానే స్ర్తీవిముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభిస్తుంది. కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకలహక్కుల కోసం కృషిచేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు నమ్ముతారు.
మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సాంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, దళితుల, స్ర్తీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు కేవలం 18 ఏళ్ళు మాత్రమే.
వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆగ్రకులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. స్త్రీ పురుష వివక్షకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేస్తుంది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే.
1890 ప్రాంతంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలుతుంది. ఈ సందర్భంగా ఈ దంపతులు ఎంతోమందికి సేవచేస్తారు. కానీ దరదృష్ణ వశాత్తూ ఇదేవ్యాధి సావిత్రిబాయి పూలేను కూడా కబళిస్తుంది. 1897 మార్చి 10వ తేదీన సావిత్రిబాయి స్వర్గస్తులయ్యారు.