header

Ashoka the Great… అశోక చక్రవర్తి..

Ashoka the Great… అశోక చక్రవర్తి.. భారతదేశ చక్రవర్తులలో ఆగ్రగణ్యుడు అశోక చక్రవర్తి. ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. బింబిసారుని పుత్రుడు. ఇతని పరిపాలన క్రీ.పూర్వం 268 సం.నుండి 232 సం.దాకా సాగింది. దాదాపు భారతదేశమంతా (తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలు తప్ప) అశోకుని ఏలుబడిలోకి వచ్చింది. అశోకుని కాలంలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంది.
అశోకుని రాజధాని పాటలీపుత్రం (ప్రస్తుతం పాట్నా). అశోకుడు ప్రధమంలో హిందూ మతాభిమాని. చాలా పరాక్రమవంతుడు. తాత చంద్రగుప్తుని శౌర్య పరాక్రమాలకు వారసుడు. తన పరాక్రమంతో భారతదేశంలో చాలా ప్రాంతాలను జయించి తన ఏలుబడిలోనికి తెచ్చుకున్నాడు. చండశాసనుడు, క్రూరుడుగా పేరుపొందాడు. సింహాసనం కోసం తన 99 మంది సోదరులను హతమార్చాడని కొంతమంది పండితుల అభిప్రాయం.
అశోకుడు తన జైత్రయాత్రలో భాగంగా కళింగ రాజ్యం (నేటి ఒడిషా) మీదకు దండెత్తటం జరిగింది. కళింగులు కూడా గొప్ప సాహసంతో అశోకుడి సేనలను ఎదర్కొన్నారు. కానీ ఓడిపొయారు. తీవ్రంగా జరిగిన ఈ యుద్ధంలో దాదాపు లక్షమంది సైనికులు మరణించటం జరిగింది. ఇంకా లక్షలాదిమంది గాయాల పాలలు అవటం, నిరాశ్రయులుగా మారటం జరిగింది. ఈ భయంకర దృశ్యాలు స్వయంగా చూసిన అశోకుని మనస్సు వికలమై బౌద్ధమతాన్ని స్వీకరించాడంటారు.
తరువాత బౌద్దమత వ్యాప్తికి కృషిచేశాడు. తన కుమారుడు మహేంద్రను కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపించి బౌద్ధమత వ్యాప్తికి పాటుపడ్డాడు. బౌద్ద సన్యాసులకోసం ఆరామాలు, నివాసాలు, చైత్యాలు కట్టించాడు. అనేక శాసనాలను చెక్కించాడు. బాటసారుల కోసం రహదారులకు ఇరువైపుల చెట్లు నాటించాడు. అనేక బావులను తవ్వించాడు. మనుషులకు, జంతువులకు కూడా అశోకుని కాలంలో వైద్యశాలలు ఏర్పాటు చేయబడ్డాయి.అశోకుడు బౌద్దమతం స్వీకరించిన్పటికీ ఇతర మతాలను ద్వేషించలేదు, మతసహనం చూపి బ్రాహ్మణులను కూడా గౌరవించాడు.
అశోక చక్రవర్తి కి చెందిన అశోక చక్రాన్ని భారత జాతీయజెండా మధ్యభాగంలో చూడవచ్చు.
అశోకుని తరువాత ఇతని సామ్రాజ్యం విచ్చినమైనది. సరియైన వారసులు లేకపోవటం వలన, అశోకుడు యుద్ధాలు మాని శాంతి మార్గంలో పయనించటం వలన అనేక మంది సామంతులు స్వతంత్రం ప్రకటించుకున్నారు.