నందవంశానికి చెందిన మహాపద్మనందునికి ముర అనే శూద్ర స్త్రీ వలన జన్మించాడంటారు. ముర పుత్రుడు కావటంవలన మౌర్య అనే పేరువచ్చింది. క్రీ.పూర్యం 340 సం.లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను తన తల్లి పేరుమీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని రాజధాని నగరం పాటలీపుత్రం (బీహార్ లోని నేటి పాట్నా). ఈ చక్రవర్తి పుట్టుక గురించి పండితులలో విభిన్న అభిప్రాయాలున్నాయు.
మహాపద్మనందునికి తొమ్మిది మంది కుమారులు. వీరు నవనందులుగా పేరుపొందారు. వీరిలో చివరి వాడు ధననందుడు క్రూరుడుగా పేరుపొందాడు. ఇతనిచే అవమానింపబడి చంద్రగుప్తుడు తల్లితో సహా రాజ్యం వదలి వెళ్లాడు. తక్షశిలలో గురువుగా పేరుపొందిన చాణుక్యుడు కూడా నందులచే అవమానించబడి వారిని నాశనం చేస్తానని ప్రతిన పూనాడు.
తరువాత చంద్రగుప్తుణ్ణి చేరదీసి అతని సాయంతో నందవంశాన్ని నాశనం చేసి పాటలీపుత్రం రాజధానిగా మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేశాడు.
చంద్రగుప్తుడు మహాపరాక్రమశాలి. రాజనీతి విశారదుడు. వంగదేశం మొదలుకొని ఆఫ్గనిస్తాన్ వరకు గల ప్రాంతాన్ని, పశ్చిమాన మాళవ, సౌరాష్ట్ర (నేటి గుజరాత్) దక్షిణ భారతదేశంలో చాలా భాగాన్ని జయించాడు. దేశంలో రహదారులు, నీటిపారుదల వ్యవస్థలు నిర్మించి బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పరచాడు
చరిత్ర ప్రసిద్ధిగాంచి ఆశోక చక్రవర్తి ఇతని కుమారుడైన బింబిసారుని పుత్రుడు.
చివరి దశలో జైనమతాన్ని స్వీకరించి క్రీ.పూర్వం 298 సం.లో మైసూరు సమీపంలోని శ్రావణ బెళగొళలో మరణించినట్లు చారిత్రిక ఆధారాల వలన తెలుస్తుంది.