ఇతను గొప్ప వీరుడు కూడా. వెలనాటి పృధ్వీశ్వరునని, నెల్లూరు పాలకుడు తమ్ముసిద్దిని, తూర్పు గాంగ రాజైన అనియంక భీముణ్ణి, కంచి పాలకుడు రాజేంద్రచోళున్ని జయించాడు. దాదాపు తెలుగు ప్రాంతాలన్నిటిని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.
ఒకటవ ప్రతాప రుద్రుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను పూర్తిచేశాడు. గణపతి దేవుని భార్య సోమలా దేవి. ఇతనికు కుమారులు లేరు. తన చిన్నకూతురు రుద్రాంబకు యుద్ధ విద్యలలోనూ, రాజకీయ వ్యవహారాలలో శిక్షణ ఇచ్చి తన తరువాత రాజ్యాధికారం అప్పగించాడు.
గణపతి దేవుడు గొప్ప కవిపండిత పోషకుడు. ఈయన ఆస్థానంలో అనేక మంది విద్యాంసులు ఉండేవారు. ఈయన సేనాని జాయప గొప్ప కళావేత్త. గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్యరత్నావళి అనే సుప్రసిద్ధ గ్రంధాల రచయిత.
గణపతిదేవుడు పాలంపేట, ఘనాపురం, పిల్లలమర్రి ఇంకా అనేక చోట్ల దేవాలయాలు కట్టించాడు. రామప్ప చెరువు, పాకాల చెరువు ఇతని కాలంలోని త్రవ్వించబడ్డాయి.